ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనసులో మాట సూటిగానే చెప్పేశారు.లోకేశ్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించడం ఖాయమైనట్టే. ఇందుకు ఆటంకాలేమీ లేవని చెప్పడమే గాక తను పార్టీకోసం చాలా కాలంగా కష్టపడి పనిచేస్తున్నారని కూడా ఆయనన్నారు. తగు సమయంలో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఇంత స్పష్టంగా ఈ విషయం ఆయనచెప్పడం ఇదే మొదటిసారి. గతంలో రాజ్యసభకు లోకేశ్‌ను పంపిస్తారని కొన్ని కథనాలు నడిచినప్పుడు కూడా అదేం జరగదని 360లో చెప్పుకున్నాం. కేంద్రమంత్రి సుజనాచౌదరి కూడా అప్పట్లోనే ఆ విషయం చెప్పారు కూడా. ఎవరు ఏం చెప్పినా ఇప్పుడు చంద్రబాబే స్వయంగా ధృవీకరించారు గనక గతంలో వలె వందిమాగధులు పోటీపడి బలపర్చాల్సిన పనివుండదు.
మరో రెండు కీలక రాజకీయ సంకేతాలు కూడా ముఖ్యమంత్రి అందించారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారే అవకాశం లేదని చెప్పారు. అంటే బిజెపితో చెలిమి కొనసాగిస్తానని అర్థం. రాజ్యసభ స్థానాలు ఆఖరు వరకూ అడగకుండా బిజెపి బెట్టుచేసింది. చివరలో అడిగినా రైల్వే మంత్రి సురేష్ ప్రభును తెలుగుదేశం ఎంపిక చేసింది. తద్వారా తాము స్నేహం కోరుతున్నామని నిరూపించుకుంది. చంద్రబాబు స్వయంగా సమీకరణాలు మారవని చెప్పడంతో బిజెపి వైఖరి మరింత బిగుసుకునే అవకాశం వుంది.
తెలంగాణలో ప్రాజెక్టుల వివాదాలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌తో తను సమావేశమయ్యే అవకాశం లేదని చంద్రబాబు చెప్పడం కూడా ఇదే ప్రథమం. గతంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు రాసిన లేఖలకు ఇచ్చిన సమాధానంలో ఎపి మంత్రి ఉమామహేశ్వరరావు ఇదే భావం వెలిబుచ్చుతూ వచ్చారు. కృష్ణా గోదావరి నదీజలాల ఉన్నతస్థాయి వ్యవస్థల ముందు త్రిపక్ష వేదికపై మాత్రమే చర్చ జరగాలన్నది ఎపి అభిప్రాయంగా వుంది. అయితే కృష్ణా బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తుందనేది తెలంగాణ అభియోగం. దీన్ని రాజకీయ విమర్శలకే పరిమితం చేయకుండా కేంద్రానికి ఫిర్యాదు రూపంలోనే లేఖరాశారు. మరి మధ్యవర్తి వ్యవస్థ లేకుండా ఇంత తీవ్ర సమస్యలు పరిష్కారం కాబోవు. అసలు తెలంగాణతో కలసి కూచోవడమంటేనే వారి వాదనను ఆమోదించినట్టవుతుందని ఎపి అనుకుంటున్నది. దిగువ రాష్ట్రమే గనక ఎపి ఏమనుకున్నా తమకు ఇబ్బంది లేదన్నది కెసిఆర్ వైఖరిగా వుంది. గతంలో తెలుగుగంగపై కర్ణాటక వివాదం లేవనెత్తినప్పుడు ఎన్టీఆర్ దానిలో భాగస్వామి కావడానికి చాలా కాలం నిరాకరించారు. అంటే ఈ పరస్పర విమర్శలు కవ్వింపు వ్యాఖ్యానాల ధోరణి కొనసాగుతుందన్న మాట.
రిజర్వేషన్లకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలే చేశారు. నా కులంలోనూ పేదలున్నారు అన్న వాక్యం కూడా ఆయన ఇంటర్వ్యూలో వుంది. కాపులను బిసిలలో చేర్చడం ఒకటైతే అగ్రకులాల్లోనూ పేదలకు రిజర్వేషన్ కల్పించాలన్నట్టు మాట్లాడారు.తాను కులరాజకీయాలు చేస్తున్నాననే ఆరోపణను తోసిపుచ్చారు.
అమరావతికి ఉద్యోగుల తరలింపులోనూ గట్టిగానే మాట్లాడారు గాని మరోవైపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాటల్లో కొంత వెసులు బాటు ఇస్తామనే ధోరణి కనిపించింది. అసలు ఉద్యోగుల వెంటపడటం కన్నా సాంకేతిక నైపుణ్యంపై శ్రద్ద పెంచుతామన్నట్టు చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే ఉద్యోగుల నుంచి ఆయనకు రావలసినంత మద్దతు రావడం లేదన్నట్టు ఆంధ్రజ్యోతిలో ఆర్కే రాయడం కొసమెరుపు. సమన్వయంతో పరిష్కరించుకోవలసిన సమస్యగా దీన్ని చూడటం ముఖ్యం. వెలగపూడిలో గాక వివిధ చోట్ల శాఖల కార్యాలయాలు ఏర్పాటైతే ఉద్యోగులకు మరింతకష్టం అన్న మాట కూడా వినిపిస్తుంది.