హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్మించబోయే నూతన రాజధాని అమరావతి వలన పర్యావరణానికి తీవ్ర అనర్థం వాటిల్లుతుందని ఐక్యరాజ్యసమితి అనుబంధసంస్థ యూఎన్డీపీ(యునైటెడ్ నేషన్స్ డెవలెప్మెంట్ ప్రోగ్రామ్) హెచ్చరించింది. పచ్చదనం తగ్గిపోవటం, కాంక్రీట్ నిర్మాణాలు పెరిగిపోవటం, ఆటోమొబైల్, పారిశ్రామిక ఉద్గారాలు అదుపు తప్పటం, పక్కనే ఉన్న ధర్మల్ పవర్ స్టేషన్లనుంచి ఉద్గారాలు, చుట్టుపక్కల కొండలలో అనుమతి, అజమాయిషీలేని మైనింగ్ కార్యకలాపాలు, వరి పొలాలు, ఆగ్రో ప్రాసెసింగ్ కార్యకలాపాలనుంచి వెలువడే ఉద్గారాలు అమరావతి ప్రాంత పర్యావరణాన్ని దెబ్బతీస్తాయని యూఎన్డీపీ ఇటీవల రూపొందించిన నివేదికలో పేర్కొంది. దీనితో అమరావతి చుట్టుపక్కల వాతావరణం చెడిపోతుందని హెచ్చరించింది. ఇప్పటికే విజయవాడ ప్రాంతం, కోస్తా బెల్ట్ ప్రాంతాలలో అనేకచోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పేర్కొంది. నదులలో, పంటకాలువలలో విస్తృతంగా కాంక్రీట్ కరకట్టలను నిర్మించటం, ఇసుకదిబ్బలు మేట వేయటం వలన రేడియేషన్ పెరగటంతోకూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపింది. దీనికి పరిష్కారంగా – ప్రభుత్వం, పరిశ్రమలు ఇంధన పొదుపు వ్యవస్థలను ఏర్పాటుచేయటానికి ప్రాధాన్యత ఇవ్వాలని, తవ్వకం పూర్తయిన గనులను శాస్త్రీయపద్ధతిలో మూసేయాలని, గ్రీన్ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించింది.
అమరావతి ప్రాంతం నదిపక్కన ఉంది కాబట్టి అక్కడ నేలకు కుంగిపోయే స్వభావం ఉంటుందని, అదీకాక ఆ ప్రాంతం భూకంపాలు సంభవించే జోన్లో ఉందని ఇప్పటికే కొందరు వాదిస్తుండగా ఇప్పుడు ఐక్యరాజ్యసమితి అనుబంధసంస్థ విడుదలచేసిన ఈ నివేదిక మరింత ఆందోళనలను రేకెత్తించేదిగా ఉంది. 1.35 లక్షల ఎకరాలలో అమరావతి రూపుదిద్దుకుంటోందని, 50 అంతస్తులతో సెక్రటేరియట్ నిర్మిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న చంద్రబాబు బృందం ఈ నివేదికపై ఏమంటుందో! రానున్న అసెంబ్లీ సమావేశాలలోనైనా అమరావతి నిర్మాణంపై సందేహాలను నివృత్తి చేస్తుందేమో చూడాలి.