హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపి ఉద్యోగుల తరలింపు వ్యవహారం ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య, అలాగే ఉద్యోగ సంఘాల మద్య కూడా ఘర్షణ వాతావరణం సృష్టిస్తోంది. ఈ సమస్యపై ఏపి ఎన్.జి.ఓ.సంఘాల నాయకుడు అశోక్ బాబు ఒక ప్రముఖ తెలుగు టీవి చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆ వివరాలు:
ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైతే చెట్టు క్రింద కూర్చోనైనా పనిచేస్తామని చాలాసార్లు చెప్పిన మీరు, ఇప్పుడు అమరావతితరలిరావడానికి గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారెందుకు?
అశోక్ బాబు: ఆ ఆరోపణ సరికాదు. మంచి నీళ్ళు, రోడ్లు, బస్సు సౌకర్యం వంటి మౌలిక వసతులు లేకపోయినా మేము వెళ్లిపని చేయడానికి మాకు అభ్యంతరం లేదు. అవి చాలా చిన్నచిన్న సమస్యలు. కానీ మేము పనిచేయడానికి అవసరమైన కంప్యూటర్లు, ప్రభుత్వ ఫైళ్ళు, డాటావంటివేవీ లేకుండా అక్కడికి వెళ్లి కూర్చొని రావడం ఏ ఉపయోగం ఉండదు. మేము అక్కడికి వెళ్తే మొదటి రోజు నుంచే మేము పనిచేసుకొనే విధంగా ఉండాలి. లేకుంటే ప్రజలకి, ప్రభుత్వానికే చాలా నష్టం కలుగుతుంది. రాష్ట్ర విభజన తరువాత ఏపి, తెలంగాణా సచివాలయాలు వేర్పడినప్పుడే మళ్ళీ అన్నీ గాడినపెట్టడానికి మూడు నెలలు పట్టింది. ఇప్పుడు ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా అమరావతి వెళ్లిపోతే పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయి. అయినా జూన్ 27 నాటికి కూడా తాత్కాలిక సచివాలయం సిద్దం అయ్యే అవకాశం లేనప్పుడు మేము అక్కడికి వెళ్లి ఏమి చేయాలి? తాత్కాలిక సచివాలయంలో పని మొదలుపెట్టడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉద్యోగులను తరలించడం అందరికీ మంచిది. అప్పుడు ఎవరూ అభ్యంతరాలు చెప్పడానికి కూడా వీలుండదు.
ప్రశ్న: కొందరు ఉద్యోగులు ‘శాశ్విత రాజధాని నిర్మించేవరకు మేము అమరావతి వెళ్ళము. సౌకర్యాలు లేకుండా వెళ్ళము,’ అంటూ హైదరాబాద్ లో సచివాలయం వద్ద ధర్నాలు చేస్తున్నారు. కొందరు భాజపా నేత పురందేశ్వరిని కలిసి తరలింపు ప్రక్రియని నిలిపివేయాలని కోరారు. దానిపై మీ అభిప్రాయం?
అశోక్ బాబు: ఈ వ్యవహారంలో ఉద్యోగులు పురందేశ్వరిని కలవడం సమంజసం కాదని నా అబిప్రాయం. ఆమెకి దీనితో ఎటువంటి సంబంధం లేదు. అయినా ఆమె కూడా ఉద్యోగులను అమరావతి వెళ్ళవద్దని చెప్పరు కదా? ఉద్యోగులలో కొందరు చోటామోటా నేతలు ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకొని అందరి దృష్టిలో పడాలనుకొంటారు. ఉద్యోగుల తరలింపు ప్రక్రియపై మా సంఘాల నేతలతో నేను స్వయంగా మాట్లాడి వారి అభిప్రాయలు, సలహాలు, సూచనలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకొంటాను.
ప్రశ్న: గత అనుభవాల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకు, ఉద్యోగ సంఘాలకి భయపడుతున్నారని టాక్. అది నిజమేనా?
అశోక్ బాబు: అలాగా అనుకోవడం చాలా తప్పు. ఒకప్పుడు ఆయన ఉద్యోగులతో కటినంగా వ్యవహరించిన మాట వాస్తవమే. ఇప్పుడు ఉద్యోగులతో స్నేహభావంతో మెలుగుతున్న మాట కూడా వాస్తవమే. ఆయన మాతో ఏవిధంగా వ్యవహరించినా అది రాష్ట్రాభివృద్ధి కోసమే తప్ప మాపట్ల కోపంతోనో భయంతోనో వ్యవహరిస్తున్నారని మేము భావించడం లేదు.
ప్రశ్న: ఒకవేళ జూన్ 27లోగా మీరందరూ అమరావతి తరలివెళ్ళకపోతే ప్రభుత్వం మీపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనే అవకాశం ఉందా? ఉంటే మీరే విధంగా స్పందిస్తారు?
అశోక్ బాబు: అటువంటి అవకాశమే లేదని భావిస్తున్నాను. పట్టిసీమ ప్రాజెక్టుని నిర్దిష్ట గడువులో పూర్తిచేయాలనుకొన్నారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన మరొక నెల ఆలశ్యం అయ్యింది. అదే ముందే ఒక నెల అదనంగా గడువు పెట్టుకొని ఉండి ఉంటే, ఆ గడువులోగానే పూర్తి చేయగలిగామనే క్రెడిట్ అందరికీ దక్కేది కదా? ఇదీ అంతే. జూన్ 27నాటికి తాత్కాలిక సచివాలయమే సిద్దం కాదని తెలుస్తున్నప్పుడు, ఈవిధంగా ఒత్తిడి చేయడం వలన ఏమి ప్రయోజనం. మరొక రెండు నెలలు గడువు పెట్టుకొని అన్ని పనులు పూర్తి చేసుకొని తరలిస్తే ఎవరూ అభ్యంతరాలు చెప్పలేరు కదా?