హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల తరలింపు ప్రక్రియపై సోమవారం మరి కొంత స్పష్టత వచ్చింది. ఏపి ఎన్జీవో సంఘాల నాయకుడు అశోక్ బాబు, ఏపి ఉద్యోగ సంఘం నేత మురళీ కృష్ణ, ఏపి సచివాలయ గజిటెడ్ అధికారుల సంఘం నాయకుడు కృష్ణయ్య ముగ్గురూ కూడా అమరావతి తరలివెళ్లేందుకు ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని ప్రకటించారు. కొందరు ఉద్యోగులు అయిష్టత చూపుతున్నప్పటికీ, దానిని అందరికీ ఆపాదించవద్దని వారు కోరారు. తాత్కాలిక సచివాలయం నుంచి పరిపాలన సాగుతుందని మొదట చెప్పిన ప్రభుత్వం, ఆ తరువాత విజయవాడ, గుంటూరు నగరాలలో ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలు వెతుక్కోవాలని చెప్పడం వలననే ఉద్యోగులలో గందరగోళం ఏర్పడిందని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ తో మాట్లాడిన తరువాత దానిపై స్పష్టత వచ్చిందని చెప్పారు. తాత్కాలిక సచివాలయం సిద్దం కాగానే తాము ఎప్పుడంటే అప్పుడు తరలిరావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే జూన్ 15 నాడే కొందరు ఉద్యోగులు తరలిరవడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.
తాత్కాలిక సచివాలయంలో అందుబాటులోకి వచ్చే కార్యాలయాలను బట్టి ఉద్యోగులు దశలవారిగా తరలివస్తామని చెప్పారు. ఆగస్ట్ నెలాఖరు నాటికి తాత్కాలిక సచివాలయం నిర్మాణం పూర్తయ్యేనాటికి మొత్తం అన్ని శాఖల ఉద్యోగులు, అధిపతులు తరలివస్తామని చెప్పారు. ప్రభుత్వం యధాశక్తిన ఉద్యోగులకి సహకారం అందిస్తోందని వారు అంగీకరించారు. ఈ వ్యవహారంలో తాము కూడా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని, కొన్ని సౌకర్యాలు లేకపోయినా సర్దుకుపోతామని చెప్పారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయమే అంతిమ నిర్ణయమని దానికి తామంతా కట్టుబడి ఉంటామని చెప్పారు. త్వరలోనే స్థానికత, 30శాతం హెచ్.ఆర్.ఏ.ల పై కూడా ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.
ఉద్యోగుల తరలింపుకి సమయం దగ్గర పడుతున్నకొద్దీ, ఉద్యోగులలో ఆందోళన పెరగపోడం సహజమే. అమరావతి తరలిరావడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు హైదరాబాద్ సచివాలయంలో ప్లకార్డులతో ధర్నాలు చేసిన మాట కూడా వాస్తవమే. అయితే ఈ సమస్య ఇంకా ఎక్కువ రోజులు సాగదీస్తే, ఉద్యోగులకి, ప్రభుత్వానికి మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడటమే కాకుండా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుకనే అందరూ పట్టువిడుపులు ప్రదర్శించి, ఈ సమస్యని సమరశ్యంగా పరిష్కరించుకోక తప్పదు. ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు ఒకమెట్టు దిగి ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధం అని స్పష్టం చేస్తున్నారు కనుక ప్రభుత్వం కూడా వారిస్తున్న సలహాలు, సూచనలను సానుకూలంగా స్వీకరించితే అందరికీ మంచిది.