ప్రొఫెసర్ కంచ ఐలయ్య బ్రాహ్మణులకు వ్యతిరేకంగా చేస్తున్న తీవ్ర విమర్శలపై మీ స్పందన ఏమిటని కొందరు నన్నడిగారు. . ఆయన ఏ ఒక్క వ్యక్తిమీదనో కాకుండా వ్యవస్థపై చేస్తున్నప్పుడు ఆ విధంగానే చూడాల్స వుంటుంది.ఎందుకంటే బ్రాహ్మణీయ సమాజం అన్నప్పుడు మొత్తం సమాజం తప్ప ఒక కులం కాదు. ఆ కులవివక్షను మీరు ఆమోదించకపోతే ఐలయ్య విమర్శ మీకు తగలదు. ఒక వేళ మీరు నిజంగా ఇప్పటికీ మేమే అగ్రభాగాన వుండి ఆధ్యాత్మిక గురువుల పాత్ర పోషించాలనుకుంటే అప్పుడు ఆయన విమర్శలకు సమాధానంచెప్పుకోకతప్పదు. ఎందుకంటే ఎవరికైనా అవ్వా బువ్వా కావాలంటే కుదిరేపనికాదు కదా. నిండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే చండాలుండేటి సరిభూమి యొకటే అన్న అన్నమయ్య పాటలు పాడుకుంటున్నప్పుడు ఐలయ్య మాటలకు ఆక్షేపణ ఎందుకు?
ఐలయ్య వాదనలకు ఒక గట్టిఉదాహరణ ఇప్పుడు తమిళనాడులో ఎదురైంది. అక్కడ ప్రభుత్వం బ్రాహ్మణేతరులకు పూజారి వృత్తిలో శిక్షణ ఇప్పించింది. 2007-09 మధ్య ఆ విధంగా 206 మంది శిక్షణ పొందారు. కాని ఇప్పటి వరకూ వారికి ఉద్యోగ నియామకాలు లేవు. దేవాదాయ శాఖ తరపున పూజారిగా పనిచేసేందుకు కులం కొలబద్ద కావడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదని సుప్రీం కోర్టుతీర్పు నిచ్చిన తర్వాత కూడా వీరికి నియామకాలు లభించలేదు. ఆ తీర్పులో సుప్రీం కోర్టు ఆనవాయితీని బట్టి నియామకాలు చేయాలని ఒక సూచన చేయడంతో దాన్ని లొసుగుగా మార్చుకుని వారిలో ఎవరికీ నియామకాలు లేకుండా చేశారు. ప్రభుత్వం ఒకసారి శిక్షణ ఇచ్చినా నియామకాలు జరగలేదంటే కులం పట్టు వున్నట్టా లేనట్టా? గుడిలో దేవుడి విగ్రహం బ్రాహ్మణేతరుల పూజలు తీసుకోనంటుందా? ఈ శిక్షణ పొందిన అభ్యర్థుల సంఘం కార్యదర్శి వి.రంగరాజన్ తమకు సత్వరం నియామకాలు జరగాలని కోరుతున్నారందుకే. కొంతకాలం కిందట తిరుపతిలోనూ ఇలాటి వివాదమే ఎదురైంది. బ్రాహ్మణేతరులకు వేదవిద్య నేర్పిపూజారి పని ఇప్పిస్తామంటే చాందసులు దుమారం రేపారు.
ఈ వివక్ష మతం మారిన క్రైస్తవులలోనూ వుందని తమళనాడులోనే జరిగిన అధ్యయనం తెలియజేస్తున్నది.ఆ రాష్ట్రంలో 39,64,360 మంది క్యాథలిక్కులుంటే వారిలో 22,40,726 మంది దళితులనుంచి వచ్చినవారే. కాని క్యాథలిక్ చర్చిలోనూ ఎలాటి ముఖ్య బాధ్యతలు ఈ దళిత క్రైస్తవులకు ఇవ్వడం లేదు. దలిత్ విడుదలై పెరవి నాయకుడు జాన్ సురేష్ మాట్లాడుతూ. దళితులు వివక్షను వదలించుకోవడానికే మతం మార్చుకుంటారనేది నిజం కాదనీ అయితే ఆ తర్వాత కూడా వారిని తక్కువగా చూడటం కొనసాగుతుందని చెప్పారు.ఈ సమస్య ప్రొటెస్టంట్ శాఖలోనూ వుంది.కొన్నిచర్చిలలో దళితుల అంతిమ సంస్కారానికి కూడా అనుమతించడం లేదట. కనుక కుల వివక్షపై పోరాడ్డం సంస్కారవంతుల బాధ్యత అని గుర్తించాల్సిందే!