తెలంగాణా ఉద్యమ సమయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన తెలంగాణా రాజకీయ జేయేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై తెరాస నేతలు, మంత్రులు ఒకేసారి విరుచుకుపడ్డారు. ఆయన చేసిన పాపం ఏమిటంటే తెరాస ప్రభుత్వ పాలన పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడమే. “తెరాస రెండేళ్ళ పాలనలో ఆశించిన అభివృద్ధి జరుగలేదని, ఒకవేళ మీకు చేతకాకపోతే తప్పుకోండి మేము అభివృది చేసి చూపిస్తాము,” అని అన్నారు.
తెలంగాణా ప్రతిపక్ష పార్టీలన్నీ తెరాస పాలన గురించి అదేవిధమైన అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, తెరాస వాటిని పట్టించుకోవడం మానేసింది. కానీ ప్రొఫెసర్ కోదండరాం అన్న మాటలకు మాత్రం తెరాస నేతలు చాలా తీవ్రంగా స్పందించారు. తెరాస ఎంపి బల్క సుమన్ ఆయనని కాంగ్రెస్ పార్టీ ఏజంటుగా వర్ణించారు. అయన కుబుసం విడిచిన పాము వంటివారని అన్నారు. తెలంగాణా ఏర్పడిన తరువాత జేయేసి నుంచి దాని భాగస్వాములు బయటకు వెళ్ళిపోయినా తరువాత దాని ఉనికే కోల్పోయింది. అటువంటి జేయేసికి ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్ అని చెప్పుకోవడాన్ని ఆక్షేపించారు. కోదండరాం తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు. అయన వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
మంత్రులు జగదీశ్ రెడ్డి, కడియం శ్రీహరి, లక్ష్మా రెడ్డి, జాగు రామన్న తదితరులు కూడా ప్రొఫెసర్ కోదండరాం గురించి ఇంచుమించు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణా ప్రభుత్వ పాలనని, అది అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలని యావత్ దేశం మెచ్చుకొంటుంటే ప్రొఫెసర్ కోదండరాం అది కనబడలేదా వినబడలేదా అని వారు ప్రశ్నించారు. తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం, రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ప్రతిపక్షాలని, ముఖ్యంగా తెదేపా నేతలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రొఫెసర్ కోదండరాంని తెలంగాణా ప్రజలు, ఇప్పటికీ తాము కూడా గౌరవిస్తునే ఉన్నామని, ఆ గౌరవం నిలుపుకోవాలని సూచించారు.
ప్రొఫెసర్ కోదండరాం పై తెరాస నేతలు మూకుమ్మడిగా దాడి చేయడానికి కారణం వారు చెపుతున్నదే. తెలంగాణా రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసినందుకు నేటికీ ప్రజలకి ఆయన పట్ల అపారమైన గౌరవం ఉంది. కనుక ఆయన మాటకి ప్రజలు చాలా విలువిస్తారు. అటువంటి వ్యక్తి నిజంగానే ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించి తెరాసకి వ్యతిరేకంగా గళం విప్పినట్లయితే, ఇంతవరకు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు తెరాస ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. వాటికి ప్రత్యామ్నాయంగా ఆయన రాజకీయ పార్టీతో ప్రజల ముందువస్తే, తెరాసని వ్యతిరేకిస్తున్న ప్రజలు, రాజకీయ శక్తులు అన్నీ మళ్ళీ ఆయన పంచన చేరి తెరాసకి సవాలు విసిరే ప్రమాదం ఉంటుంది. బహుశః ఆ భయంతోనే తెరాస నేతలందరూ ఆయనపై మూకుమ్మడి దాడి చేశారని భావించవచ్చు. కానీ ఆయనపై ఈవిధంగా తెరాస నేతలు ఎదురుదాడి చేస్తే తెరాసకే నష్టం కలుగవచ్చు. తెలంగాణా కోసం పోరాడిన ఆయనకి ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత గౌరవం ఈయలేదనే అభిప్రాయం, ఆ కారణంగా ఆయనపై సానుభూతి ప్రజలలో, మేధావులలో ఉంది. తెరాస నేతలందరూ ఆయనపై మూకుమ్మడిగా దాడి చేయడం వలన ఆ సానుభూతి ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు.