ఒకరి గొప్పదనం గురించి లోకం చెప్పుకొంటుకొంటే అది ఆ వ్యక్తి కీర్తి ప్రతిష్టలవుతాయి. అదే తన గొప్పదనం గురించి తనే చెప్పుకొంటుంటే అది స్వోత్కర్ష (సొంత డబ్బా) అవుతుంది. కొందరికి నిత్యం సొంత డబ్బా కొట్టుకోవడం అలవాటు. అది వారి బలహీనత. ఆ అలవాటు లేని మరికొందరు తమ గొప్పదనం గురించి సొంత డబ్బా వాయించుకొంటారు. తీవ్ర అభద్రతాభావంతో బాధపడుతున్నారని దానర్ధం. మన గురించి లోకం చులకనగా భావిస్తోందేమోననే అనుమానం, భయం కారణంగానే డబ్బా వాయించుకోవడం మొదలుపెడతారు. దానినే ఇంగ్లీషులో ‘ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్’ అని అంటారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా అటువంటి అభద్రతా భావంతో బాధపడుతున్నట్లున్నారని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అది ఓటుకి నోటు కేసు బయటపడినప్పటి నుంచే మొదలైందని వారి అభిప్రాయం.
ప్రజలు తన అనుభవం, సమర్ధత, పరిపాలనా దక్షతలను చూసే తెదేపాని గెలిపించి తనను ముఖ్యమంత్రిని చేశారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన భాద్యత తనపై ఉందని ఆయన చాలాసార్లు చెప్పుకొన్నారు. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పుకొంటున్నారు. కానీ రెండేళ్ళు పూర్తయినా రాజధాని, పోలవరం నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పంటరుణాల మాఫీ వంటి హామీలను అమలు చేయలేకపోవడం వంటి అనేక కారణాల చేత ప్రజలలో తన ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించినట్లే ఉన్నారు. బహుశః అందుకే అయన తన గొప్పదనం గురించి గట్టిగా చెప్పుకొంటున్నారనుకోవచ్చు. అయితే ఆ యావలో మైక్రోసాఫ్ట్ సంస్థ సి.ఈ.ఓ. సత్య నాదెళ్ళకి కూడా తనే స్ఫూర్తినిచ్చానని, ఆయన తండ్రి యుగంధర్ తన వద్ద పనిచేశారని చెప్పుకోవడంతో నవ్వులపాలయ్యారు.
చంద్రబాబు నాయుడు అన్న ఆ మాటని పట్టుకొని వైకాపా నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనని కడిగిపడేశారు. చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి కాక మునుపే సత్య నాదెళ్ళ మణిపాల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి అమెరికాలో ఉన్నత విద్యలభ్యసించి, 1990లో మైక్రోసిస్ సంస్థలో 1992లో మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరితే, ఆయనకి తనే స్ఫూర్తినిచ్చానని చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకొంటున్నారని రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయిన సత్య నాదెళ్ళ తండ్రి యుగంధర్ 1988 వరకే రాష్ట్రంలో పనిచేస్తే, 1995లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఆయన తన వద్ద పనిచేశారని ఏవిధంగా చెప్పుకొంటున్నారని ప్రశ్నించారు. సత్య నాదెళ్ళకి కూడా స్ఫూర్తినిచ్చానని చెప్పుకొంటున్న చంద్రబాబు నాయుడు తన కొడుకు నారా లోకేష్ కి ఎందుకు ఆ స్ఫూర్తినియ్యలేకపోతున్నారని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రానికి ఐటి అనే పదం పరిచయం చేసింది తనేనని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు నాయుడుకి, అంతకు ముందు నుంచే హైదరాబాద్ లో ఐటి సంస్థలున్న సంగతి తెలియదా? అని ప్రశ్నించారు.
రాజేంద్రనాథ్ రెడ్డి అడిగిన ఈ ప్రశ్నలకి తెదేపా నేతలు తమకు అలవాటైన పద్దతిలో ఘాటుగానే జవాబు చెప్పవచ్చు కానీ ఈ సత్యాలను ఎవరూ మార్చలేరు. రాష్ట్రాభివృద్ధి పనులు మొదలైతే ఈవిధంగా గొప్పలు చెప్పుకోవడానికి ఎవరికీ తీరిక ఉండదు. కానీ అది జరుగకపోవడం చేతనే గొప్పలు చెప్పుకోవలసి వస్తోందేమో?