ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అధికార అన్నాడిఎంకె పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొని ఆ రాష్ట్రంలో అడుగుపెట్టాలని భాజపా చాలా తహతహలాడింది. కానీ అమ్మ కరుణించలేదు. భాజపాతో మాకు పొత్తులు అవసరం లేదని నిర్మొహమాటంగా చెప్పేసింది. ఆ కారణంగా భాజపా ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సహా అనేక మంది భాజపా నేతలు ఎన్నికల ప్రచార సమయంలో అమ్మ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, ఆమె కారణంగా రాష్ట్రం చాలా నష్టపోతోందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న ద్రవిడ పార్టీలన్నిటినీ కట్టకట్టి బంగాళాఖాతంలోవిసిరేయాలన్నారు.
అవన్నీ అప్పుడు మాటలు. ఇప్పుడు కొత్త మాటలు…కొత్త ఆలోచనలు…కొత్త అభిప్రాయాలు పుట్టుకొచ్చాయి. భాజపా నేతలు దేనిని అవినీతికి మారుపేరని అభివర్ణించారో ఇప్పుడు అదే అన్నాడిఎంకె పార్టీని తమ ఎన్డీయే కూటమిలో, కేంద్ర ప్రభుత్వంలో చేరుకోవడానికి ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఎందుకంటే అన్నాడిఎంకె పార్టీకి లోక్ సభలో 37మంది, రాజ్యసభలో 13 మంది సభ్యులున్నారు. మోడీ ప్రభుత్వానికి వారి మద్దతు లభించినట్లయితే, ఇక రాజ్యసభలోను తిరుగు ఉండదు. మోడీ ప్రభుత్వానికి లోక్ సభలో బిల్లులు ఆమోదింపజేసుకోవడానికి తగినంత బలం ఉన్నప్పటికీ రాజ్యసభలో కాంగ్రెస్, దాని మిత్రపక్షలదే పైచెయ్యి అవడం చేత కాంగ్రెస్ పార్టీ ముందు తలవంచవలసి వస్తోంది. చాలాసార్లు దాని ముందు తల వంచినా కూడా అది అడ్డుపడుతుండటంతో జి.ఎస్.టి. వంటి అనేక ముఖ్యమైన బిల్లులకి అడ్డు పడుతుండటంతో అవి ఆమోదానికి నోచుకోలేకపోతున్నాయి.
అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితని ప్రసన్నం చేసుకొని అన్నాడిఎంకె పార్టీని ఎన్డీయే కూటమిలో చేర్చుకోవడానికి భాజపా నేతలు తెర వెనుక గట్టి కసరత్తే చేస్తున్నారని తాజా సమాచారం. అది చాలా మంచి ఆలోచనే కానీ సరిగ్గా నెలరోజుల క్రితమే ఆమె అవినీతిపరురాలని, ఆమె పార్టీ, ప్రభుత్వం రెండూ కూడా అవినీతికి మారుపేరని వాదించిన భాజపా ఇప్పుడు అదే అవినీతి పార్టీని ఎన్డీయేలో భాగస్వామి చేసుకొంటే దేశప్రజలు ఏమనుకొంటారు? ప్రతిపక్షాలు ఏమంటాయి? అనే విషయం ఆలోచించిదో లేదో? లేకపోతే అవేమీ పట్టించుకోనవసరం లేదని అనుకొంటోందో? ముఖ్యమంత్రి జయలలిత జూన్ నెలాఖరున డిల్లీ పర్యటించబోతున్నారు. ఆమె మోడీ ప్రభుత్వాన్ని కరుణిస్తారో లేదు అప్పుడే తెలుస్తుంది.