తెలంగాణా రాజకీయ జేయేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెరాస ప్రభుత్వపాలన బాగోలేదని విమర్శించడంతో, తెరాస తన ముసుగుని తొలగించుకొని బయటకి రాక తప్పలేదు. అంతవరకు ఆయన పట్ల తెరాస ప్రత్యేక గౌరవం ప్రదర్శించకపోయినా, ఆయనకు వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదు. కనుక ఆయన పట్ల తెరాసకి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయనే విషయం ఇంత కాలం బయటపడలేదు. ఇప్పుడు అది కూడా బయటపడింది. తెలంగాణా సాధన కోసం ఆయన చేసిందేమిటి? అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన ఏ హోదాతో తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ ప్రొఫెసర్ కోదండరాం ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం ఖాయం అయితే ఆయన కూడా వారికి గట్టిగానే బదులివ్వవచ్చు. ఆ సంగతి త్వరలోనే తెలిసిపోతుంది.
ఆయన తెరాస ప్రభుత్వంపై నిన్న మళ్ళీ మరో అస్త్రం సందించారు. మెదక్ జిల్లాలో తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు క్రింద ఏటిగడ్డ కిష్టాపూర్, వేముల ఘాట్ తదితర 14 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆ గ్రామాలలో ప్రజలు ఆ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారికి ప్రొఫెసర్ కోదండరాం సంఘీభావం ప్రకటించారు.
“సమైక్య రాష్ట్రంలో తెలంగాణా ప్రజలకు జరిగిన అన్యాయాలను సరిచేయవలసిన తెరాస ప్రభుత్వం ప్రజలను భయ బ్రాంతులని చేస్తోంది. ఆంధ్రా పాలకులు చేసిన తప్పులనే అది కూడా చేస్తోంది. తెలంగాణా ప్రభుత్వం ఇదే ధోరణిలో ముందుకు సాగితే, ఒకప్పుడు ఆంధ్రా పాలకులపై ఏవిధంగా పోరాడామో దానిపై కూడా అదే విధంగా పోరాడవలసి వస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా భూసేకరణ కోసం జి.ఓ.(నెంబర్ 123) జారీ చేయడం రాజ్యాంగ విరుద్దం. ప్రజలు వేసిన ఓట్లతోనే అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు, ప్రజాభీష్టానికి అనుగుణంగా, వారికి నష్టం కలిగించకుండా పరిపాలన చేయాలి. అలా కాదని తమ ఇష్టం వచ్చినట్లు చేస్తే, చూస్తూ ఊరుకోము. మల్లన్న సాగర్ నిర్వాసితుల తరపున పోరాడేందుకు మేము సిద్దంగా ఉన్నాము,” అని ప్రొఫెసర్ కోదండరాం తెరాస ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గతంలో ఇటువంటి సమస్యలపై ప్రొఫెసర్ కోదండరాం తెరాసకి ఇబ్బంది కలిగించని విధంగా చాల సున్నితంగా విజ్ఞప్తులు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన తెరాస ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరికలు చేస్తున్నారు. అంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఉద్దేశ్యం అదే అయితే, ముందుగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని ఆ తరువాత తెరాస ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి ఉండి ఉంటే, ఆయనకు మద్దతుగా మాట్లాడేవారు ఉండేవారు. కానీ పార్టీని ఏర్పాటు చేసుకోకుండా తెరాసపై విమర్శలు చేస్తున్నందున ఒంటరిగా ఉన్న ఆయనపై తెరాస నేతలు అందరూ కలిసికట్టుగా విమర్శలు గుప్పిస్తూ ఉక్కిరిబిక్కిరి అయ్యేలాగ చేస్తున్నారు. ఆ కారణంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే ఆలోచనని విరమించుకొన్నా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఆయనకి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేనట్లయితే తెరాస ప్రభుత్వంపై ఒంటరి పోరాటం చేయడం వలన ఆశించిన ప్రయోజనం దక్కకపోగా, ఊహించని అనేక కొత్త ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. తెరాస నేతలు ఆయనపై చేసిన విమర్శలు చిన్న శాంపిల్ వంటివి మాత్రమే. కనుక ప్రొఫెసర్ కోదండరాం బాగా ఆలోచించి అడుగు ముందుకు వేయడం చాలా మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.