కాపుల నేత ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. కాపు ఐక్య గర్జన సభ తరువాత తునిలో జరిగిన విద్వంసానికి కారకులైన కొందరిని నిన్న పోలీసులు అరెస్ట్ చేయడంతో, అందుకు నిరసనగా ఆయన దీక్షకి కూర్చొన్నారు. తుని ఘటనలకు తనదే బాధ్యత అని చెపుతున్నా వినకుండా పోలీసులు అమాయకులని విచారణ పేరిట వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న అరెస్ట్ చేసిన వారినందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కావాలంటే తనను అరెస్ట్ చేయవచ్చని ముద్రగడ వాదిస్తున్నారు. పోలీసులు ఆయనకి నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసేవరకు తను ధర్నా విరమించనని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలాపురంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
తునిలో జరిగిన విద్వంసం, దాని వలన రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి అందరికీ తెలుసు. దానికి కారకులైన వారిని గుర్తించి అరెస్ట్ చేయడానికి పోలీసులకి సహాయపడవలసిన ముద్రగడ పద్మనాభం, వారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. అంటే అంత తీవ్రమైన నేరానికి పాల్పడిన వారిని ఆయన స్వయంగా వెనకేసుకొనివస్తునట్లు లేదా వారిని ఉపేక్షించమని కోరుతున్నట్లు ఉంది. చట్టం తనపని తాను చేసుకుపోకుండా ఆయన అడ్డు పడుతున్నట్లుంది. తుని విద్వంసానికి తనదే బాధ్యత అని ఆయన వాదిస్తున్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు అందులో పాల్గొన్నారని స్పష్టంగా కనబడుతున్నప్పుడు ఆయన వాదన అర్ధరహితం. ఆ విద్వంసంపై పోలీసులు కేసులు నమోదు చేయడం, దానిపై దర్యాప్తు, అనుమానితులని అరెస్ట్ చేయడం వంటివన్నీ ఆయన వ్యతిరేకిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. తద్వారా ఆయన ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లవుతోంది. ఒకవేళ ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు కలుగజేసుకొంటే మొదట ఇబ్బంది పడేది ఆయనేననే సంగతి మరిచిపోతున్నారు. కనుక ఈ వ్యవహారంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది.