ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో రెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ‘వికాస్ పర్వ్’ పేరిట బహిరంగ సభలు నిర్వహిస్తోంది. అనంతపురంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర మంత్రులు, భాజపా నేతలు ఆ సభలో పాల్గొని మాట్లాడారు. మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో సాగిపోతోందని, అవినీతిరహితమైన పాలన అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి అందిస్తున్న సహాయ సహకారాల గురించి కూడా వారు మాట్లాడారు. అవినీతికి మారుపేరుగా మారిన కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తుడిచిపెట్టే కార్యక్రమం-‘కాంగ్రెస్ ముక్త భారత్’ ఆంధ్ర ప్రదేశ్ నుంచే ఆరంభం అయ్యిందని మంత్రి జవదేకర్ అన్నారు.
మోడీ ప్రభుత్వం రెండేళ్ళు పూర్తి చేసుకొన్నందుకు భాజపా నేతలు సభలు, ర్యాలీలు నిర్వహించుకోవడం సహజమే. కానీ ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా పరిస్థితి ఏవిధంగా ఉంది? భాజపా గురించి ప్రజలు ఏమనుకొంతున్నారు? రాష్ట్ర స్థాయిలో భాజపా ఎదుర్కొంటున్న సమస్యలను ఏవిధంగా చక్కదిద్దుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలి? అనే విషయాలపై చర్చించుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకొంటే ఆ పార్టీకి ఎక్కువ ప్రయోజనం కలిగి ఉండేది.
తెలంగాణాలో ఒకరకమైన సమస్యలు, ఆంధ్రాలో మరోకరకమైన సమస్యలను భాజపా ఎదుర్కొంటోంది. ఆంధ్రాలో భాజపాకి చాలా విచిత్రమైన పరిస్థితులు, సమస్యలని ఎదుర్కొంటోంది. ఆంధ్రాలో తెదేపాకి మిత్రపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటున్నప్పటికీ భాజపా చాలా బలహీనంగా కనబడుతోంది. కారణాలు అందరికీ తెలిసినవే. వాటిలో కొన్ని పరిష్కరించగలిగేవి మరికొన్ని పరిష్కరించలేనివీ ఉన్నాయి. హామీల అమలు, తెదేపా సంబంధాలపై రాష్ట్ర భాజపా నేతలు అయోమయ స్థితిలో ఉన్నందునే రాష్ట్రంలో ఆ పార్టీ అగమ్యంగా ముందుకు సాగుతోంది. ఇది ఆ పార్టీకి ఎంతమాత్రం మంచిది కాదు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర భాజపా నేతలు కనీసం అటువంటి పరిష్కరించుకోగలిగిన సమస్యలనైనా వారు దృష్టి పెడితే చాలా సమస్యలను వదిలించుకొనే అవకాశం ఉంది.
తెలంగాణాలో కూడా ‘వికాశ్ పర్వ్’ సభలు నిర్వహిస్తారు కనుక అక్కడ పార్టీ పరిస్థితి గురించి కూడా ఆలోచిస్తే మంచిది. తెలంగాణా లో తెరాస ధాటికి తట్టుకోలేకనే భాజపా చతికిలపడుతోందని కంటికి కనబడుతూనే ఉంది. కనుక భాజపా ముందు రెండే ప్రత్యమ్నాయాలున్నాయి. ఒకటి తెరాసతో దోస్తీ. రెండు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొని తెరాసని ఎదుర్కోవడం.
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మొదటి మార్గం ఎంచుకొన్నందునే తెరాసని ఎన్డీయే కూటమిలో చేరి కేంద్రమంత్రి పదవి తీసుకోమని కోరి ఉండవచ్చు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఆఫర్ ని నిర్ద్వందంగా తిరస్కరించారు కనుక ఇక మిగిలింది రెండవ మార్గమే. తెలంగాణాలో భాజపాని కాపాడుకొని బలోపేతం చేసుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అందుకోసం ఏవిధంగా ముందుకు సాగాలనే దానిపై ఈ సందర్భంగా భాజపా నేతలు చర్చించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఎదుర్కొంటున్న ఈ సమస్యల పరిష్కారం చేసుకొని పార్టీని బలోపేతం చేసుకొనే ఆలోచనలు చేయకుండా ఆర్భాటంగా వికాస్ పర్వ్ సభలు నిర్వహించుకోవడం వలన పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదు.