కాంగ్రెస్ కు నాయకత్వం వహించడానికి రాహుల్ గాంధీ ఎట్టకేలకు సిద్ధమయ్యారు. అది ఇష్టం లేని ”పెద్దల” వర్గం ప్రియాంక గాంధీ పేరుని మరోసారి బలంగా తెరమీదికి తీసుకు వచ్చింది. ఇది చాలాకాలంగా జరుగుతున్న అంతర్నాటకమే! పార్టీబాధ్యతలు నూరు శాతం యువతరానికి అప్పగించాలన్నదే రాహుల్ షరతు. అయితే ఈ సారి సోనియా గాంధీ పెద్దల మాట పక్కనపెట్టి రాహుల్ కి సారధ్యం అప్పగించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
నెహ్రూ వారసుల్ని కాదని నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్న ఊహకూడా కాంగ్రెస్ కి రాదు. కుటుంబ పాలన, సారధ్యాల్లో క్షీణదశ పట్టిన కాంగ్రెస్ సోనియా హయాంలో నామమాత్రంగానే మిగిలిపోయింది. బాధ్యతలు మన్మోహన్ సింగ్ నెత్తిన పెట్టి అధికారం సోనియా చెలాయించిన పరిస్ధితి పదేళ్ళు సాగడమే ఇందుకు మూలం.
”వారసుడు” రాహుల్ గాంధీ కాంగ్రెస్ వ్యవహారాల మీద మొదట్లో ఆసక్తే చూపలేదు. తరువాత పార్టీలో ఆయన పని తీరు సీనియర్లకు అర్ధంకాలేదు. అన్ని స్ధాయుల్లో పార్టీ నాయకత్వాన్ని యువకులకే అప్పగించడమే రాహుల్ ప్లానని ఆలస్యంగా అర్ధమైంది. ఇది నచ్చని సీనియర్లు ఎన్నికల్లో ఓటములకు రాహుల్ సారధ్యమే కారణమని లేబుల్స్ వేయడం మొదలు పెట్టారు.
రాహుల్ జిల్లాల వారీగా, లోక్ సభ నియోజకవర్గాల వారీగా వేలాదిమంది యువతీ యువకులతో మాట్లాటి ఒక నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. లోక్ సభ నియోజకవర్గానికి ఒకరు చొప్పున కమిట్మెంటు సామర్ధ్యం వున్న 500 మంది ఆటీమ్ లోవున్న దాదాపు అందరూ అనవసర ప్రచార పటాటోపాలకు దూరంగా వుండేవారే! ఎలక్షన్లలో ప్రతీ ఫెయిల్యూర్ కీ రాషుల్ నే బాధ్యుడిని చేయడాన్నివారు గట్టిగా ఖండించడం మొదలు పెట్టారు. వరుస ఓటములకు సీనియర్లే కారణమని తిప్పికొట్టడం ప్రారంభించారు.
ప్రతీ స్ధాయిలో పార్టీ బాధ్యతలను 60 శాతం మంది సీనియర్లకు, 40 శాతం మంది యువకులకు అప్పగించాలన్న రాజీ ప్రతిపాదనను రాహుల్ తిరస్కరించడంతో ” నాయనమ్మ ఇందిరా గాంధీ లా వున్న ప్రియాంక గాంధీ సారధ్యం వహిస్తేనే కాంగ్రెస్ పూర్వ స్ధితికి వస్తుందన్న వాదన మొదలు పెట్టారు. ఇది రాహుల్, సోనియాలకు ఏమీ మాట్లాడలేని ఇబ్బంది. తల్లి సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధి, రాయబరేలి లోక్ సభా నియోజకవర్గాల బాధ్యతలు చూడటమే తప్ప ప్రియాంకకు ఇప్పటికీ రాజకీయాల మీద ఆసక్తి లేదని పార్టీ వర్గాలే చెబుతూవుంటాయి.
మరోవైపు సోనియా అనారోగ్యం ఆమెను పనిచెయ్యనివ్వడంలేదు. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు….తరువాత రెండేళ్ళలో 14 రాష్ట్రాల్లో శాసనసభలకు ఎన్నికలు…ఆతరువాత లోక్ సభ ఎన్నికలు…ఈ షెడ్యూలులో సమయం వృధాపోకుండా కాంగ్రెస్ సారధ్య బాధ్యతలను రాహుల్ క బదిలీ చేయాలన్నది ఆమె ఆలోచన. రాహుల్ షరతు ప్రకారం యూవకులకు నూరుశాతం పార్టీ బాధ్యతలు అప్పగించలేకపోయినా, 20 శాతం పార్టీ పదవులను సీనియర్లకు అప్పగించేలా అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్ వంటి సీనియర్లు పార్టీ లో సీనియర్లను ఒప్పించే పనిలో వున్నారని తెలుస్తోంది.