జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌పై టిఆర్ఎస్ ముఖ్యయలంతా విరుచుకుపడటం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల ప్రకారమే జరిగిందని ప్రతిఒక్కరికీ తెలుసు. అయితే నిన్న తెలంగాణకు నిలువెత్తు నిబద్దమూర్తిగా కీర్తించిన ఒక మేధావిని ఈ రోజు విషపునాగుగా చిత్రిస్తే ఎలా చెల్లుతుందని ఆ పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. రెండేళ్ల తర్వాత ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేసిన కోదండరాంకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం కన్నా రాజకీయ సమాధానాలు చెప్పి తేలిగ్గా తీసుకోవలసిందని పాలకపక్షీయులే అంటున్నారు. వామపక్ష నేపథ్యం నుంచి వచ్చినా కోదండరామ్ కొన్ని సందర్భాల్లో తమతో ఏకీభవించని వారిని కూడా కలుపుకొని వచ్చే విధంగా వ్యవహరించారు. తెలంగాణ రాజకీయ నేతల ఇరకాటాన్ని తను తప్పిస్తూ అన్నివేళలా సమన్వయకర్తగా వ్యవహరించారు. ఒక్కముక్కలోచెప్పాలంటే టిఆర్ఎస్కు ఉద్యమానికి సంధానకర్తగా వున్నారు. ఆయన పాత్రపై ఆంధ్రలో విమర్శలు వున్నాయి గాని తెలంగాణలో వివాదరహితులుగా కొనసాగారు. కాకపోతే కెసిఆర్ మనోభీష్టం ప్రకారం నడుస్తున్నారనే విమర్శ వుండేది గాని ఉద్యమ కాలంలోనూ కెసిఆర్ ఆయనను అక్కున చేర్చుకున్నారని చెప్పలేము. రాజకీయంగా జెఎసి అనే ఛత్రం చాలా అవసరం గనక సరుకునేవారు. తీరా రాష్ట్రం ఏర్పడి తానే అధికారంలోకి వచ్చాక ఇప్పుడు జెఎసిని అడ్డంకిలా చూశారు. వాస్తవానికి కోదండరాం కొత్త రాష్ట్రంలో వామపక్ష ఉమ్మడి ఉద్యమాలలో పాల్గొనడానికి సిద్దపడలేదు. రైతు జెఎసి కూడా ప్రత్యేకంగానే ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై సుతిమెత్తగా సానుకూలంగా మాట్లాడుతూ వచ్చారు.రెండవ ఏడాదిలోనే నెమ్మదిగా స్వరం పెంచుతూ నిరసనలకు గొంతు కలుపుతూ జెఎసి అస్తిత్వాన్ని గుర్తు చేసేపనిచేపట్టారు. మల్లన్న సాగర్ ధర్నా సందర్భంలో తారాస్థాయినందుకున్నాయి. రెండేళ్లలో ఏదీ సాధించలేకపోయిన ఈ ప్రభుత్వం దిగిపోవడం మంచిదని ఆయన అనడం టిఆర్ఎస్కు అస్సలు మింగుడుపడలేదు. అయితే ఆయన చేసిన విమర్శ మాత్రం పూర్తిగా సరైనదే. 2013 భూ సేకరణ చట్టం పక్కనపెట్టి జీవో123 కింద రైతుల భూములు తీసుకోవడం పొరబాటు. అప్రజాస్వామికం కూడా. చాలా కాలంగా ఉభయ కమ్యూనిస్టుపార్టీలు కాంగ్రెస్ దీనిపై ఆందోళన చేస్తూనే వున్నాయి.
జెఎసిని కూడా కలుపుకుని పోలేనంత అసహనం దేనికని నేను ఇటీవల ఆంధ్రజ్యోతిలో నా గమనం వ్యాసంలో ప్రశ్నించాను. ఆ అసహనంలో అహం అభద్రత ఏ స్థాయికి చేరాయని ఈ సామూహిక శాపనార్థాలను బట్టి అర్థమవుతుంది. ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయిందని ప్రకటించినవారు కోదండరాం తమకు అనుకూలమైన సూక్తులు మాత్రమే చెప్పాలని కోరుకోవడం, విమర్శలు నిషిద్దమని అనుకోవడం అర్థరహితం. కాకుంటే ఇతర రాజకీయ ప్రత్యర్థులపై ద్రోహం ముద్ర వేసినట్టే కోదండరాంపై వేయడం కుదిరేపని కాదు గనక ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు.
నేనైతే పదేళ్లనుంచి చాలా దగ్గరగానూ చర్చలలోనూ అనేక వేదికలలోనూ ఆయనను కలిశాను. విభేదించిన సందర్బాలున్నా రాజకీయ స్వార్థం ఆపాదించడాన్ని హర్షించలేను . కాంగ్రెస్ దగ్గరకు వెళ్లడం కోదండరాం తప్పు గనకే తాము విమర్శలు చేస్తున్నామని సాకులు చెబుతున్న టిఆర్ఎస్ నేతలు, వారి అధినేత కూడా తామే విలీనం ప్రతిపాదనలు చేశారన్నది కాదనలేని వాస్తవం. ఉద్యమాలపై ఉద్యమకారులపై దాడిచేసేే బదులు విమర్శలను స్వీకరించి పొరబాట్లు సవరించుకోవడంవల్ల తెలంగాణ ప్రజలకు ప్రభుత్వానికి కూడా మేలు కలుగుతుంది. అయితే కోదండరాం, ఆయన బృందం కూడా గతాన్ని సమీక్షించుకుని భవిష్యత్తుకార్యాచరణ ఏమిటో నిర్ణయించుకోవడం అవసరం. అది ఏ మేరకు ఏ రూపంలో జరుగుతుందో చూడాలి.,