సీనియర్ కాంగ్రెస్ నేత, ఛత్తీస్ ఘర్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయన భిలాస్ పూర్ జిల్లాలోని తన స్వగ్రామం కొట్మిలో సోమవారం ఒక బహిరంగ సభ నిర్వహించి తను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి స్వంత పార్టీ పెట్టుకొంటున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తన పార్టీ పేరు, చిహ్నం మొదలైన వివరాలను ప్రకటిస్తానని తెలిపారు. ఇకపై తను రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వంపై పోరాటం చేస్తానని, వచ్చే ఎన్నికలలోగా తన పార్టీని బలోపేతం చేసుకొని రాష్ట్రానికి రమణ్ సింగ్ చేతి నుండి విడిపిస్తానని చెప్పారు.
ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికార పార్టీతో, ప్రభుత్వంతో పోరాడటం సహజమే. ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రమణ్ సింగ్ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంది. కానీ అది ఎంతగా పోరాడుతున్నా 2003 నుంచి నేటివరకు ప్రజలు ఆయనకే పట్టం కడుతున్నారు. రాజకీయ పార్టీలు ప్రతిపక్ష స్థానంలో అన్నేళ్ళ పాటు మనుగడ సాగించాలంటే చాలా కష్టం. అన్నేళ్ల నిరీక్షణ తరువాత కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే నమ్మకం కలిగితే రాజకీయ నాయకులు ఈవిధంగానే వ్యవహరిస్తారు.
తెలంగాణాలో తెదేపా, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అందుకు మరో చక్కటి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. పదేళ్ళపాటు ప్రతిపక్ష బెంచీలలో కూర్చొన్న తరువాత కూడా తెదేపా తెలంగాణాలో అధికారంలోకి రాలేకపోవడం, వచ్చే ఎన్నికల తరువాత కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడం చేత చాలా మంది తెదేపా నేతలు తెరాసలోకి వెళ్లిపోయారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉంది కనుక ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. కానీ ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో కాంగ్రెస్, భాజపాలకు బలమైన ప్రత్యమ్నాయం ఏదీ లేకపోనందున అజిత్ జోగి దానినే ఒక అవకాశంగా మలుచుకొని స్వంత కుంపటి పెట్టుకోవడానికి సిద్దపడినట్లున్నారు.
ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ చాలా ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉండిపోవడం చేత దాని పరిస్థితి ఏమీ అంత గొప్పగా లేదు కనుక అజిత్ జోగి వెళ్లిపోవడం వలన కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు. పైగా ఇప్పుడు ఆయన స్వంత కుంపటి పెట్టుకొని మంచి ఉత్సాహంగా రమణ్ సింగ్ ప్రభుత్వంపై పోరాటం మొదలుపెడతారు కనుక కాంగ్రెస్ పార్టీకి కూడా సంతోషమే. వచ్చే ఎన్నికలనాటికి ఒకవేళ అజిత్ జోగి పార్టీ బలపడితే, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆయనతో చేతులు కలుపవచ్చు. ఒకవేళ నిలద్రొక్కుకోలేకపోతే ఆయనే తన పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిపెయవచ్చు. కాంగ్రెస్ పార్టీకి గతంలో చాలాసార్లు ఇటువంటి అనుభవాలు ఎదుర్కొంది కనుక వాటిలో ఇదీ ఒకటని సరిపెట్టుకోగలదు.