హస్తవిలాపం విస్తరిస్తోంది. తూర్పు నుంచి పడమర వరకూ షాక్ మీద షాక్ తగులుతోంది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి సొంత కుంపటి పెడుతున్నట్టు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి అజిత్ జోగీ ప్రకటించారు. దీంతో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మహారాష్ట్రలో సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి గురుదాస్ కామత్ కాంగ్రెస్ కు రాజీనామాచేశారు. ఇది ఆ రాష్ట్ర కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
త్రిపురలో అయితే కాంగ్రెస్ కు మింగుడు పడని షాకింగ్ న్యూస్. ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. తృణమూల్ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఏకంగా స్పీకర్ కు లేఖ కూడా ఇచ్చేశారు. త్రిపురలో కాంగ్రెస్ కు ఉన్నదే 10 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడిక నలుగురు మాత్రమే మిగిలారు. చాలా కాలంగా సీపీఎం పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి తృణమూల్ ప్రయత్నిస్తోంది. కానీ ఫలితం లేదు. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ల పుణ్యమా అని దానికి ఆరుగురు సభ్యులు లభించారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వచ్చింది.
ఈశాన్యంలోనే మరో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కోట బీటలు వారుతోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న మేఘాలయలో తిరుగుబాటుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిపై తిరుగుబాటుకు
కొందరు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వారంతా బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారట. మునిగే నావలాంటి కాంగ్రెస్ లో ఉండే కంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శిబిరంలో చేరడం మేలని వారు భావిస్తున్నారు. బీజేపీ అండతో ముఖ్యమంత్రిని దింపేసి సొంత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతున్నట్టు సమాచారం.
రాహుల్ గాంధీని వీలైనంత త్వరగా పార్టీ అధ్యక్షుడిని చేయడానికి ఓ వైపు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు తిరుగుబాట్లు పార్టీకి తలపోటుగా మారాయి. అప్పుడే రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పగించడం నచ్చకనే అజిత్ జోగీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారని అంటున్నారు. మహారాష్ట్రలో పేరు ప్రఖ్యాతులున్న కామత్ రాజీనామాకు కూడా అదే కారణం కావచ్చట. ఏమాత్రం రాజకీయ పరిణతి సాధించని రాహుల్ చేతికి పార్టీ పగ్గాలు అప్పగించడం కామత్ కు ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి సోనియా గాంధీయే పార్టీని నడిపించాలనేది ఆయన అభిప్రాయం అంటున్నారు.
తనమీద ఎన్ని విమర్శలు వస్తున్నా, రాహుల్ గాంధీ వైఖరి మాత్రం మారడం లేదు. ఇదొక సవాలుగా తీసుకుని రాజకీయ పరిణతి సాధించడానికి గానీ ఓ సమర్థుడైన నాయకుడిగా ఎదగడానికి గానీ ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు. చెప్పా పెట్టకుండా రెండు నెలలు మాయమైనప్పుడే ఆయనపై కాంగ్రెస్ నేతలకు ఆశలు అడుగంటాయి. ఆయన్ని నమ్ముకుంటే పార్టీ ముందుకు పోవడం కష్టమని ఇప్పటికే చాలా మంది సీనియర్ల గుసగుసలాడుతున్నారు. పైకి మాత్రం ఏమీ అనలేకపోతున్నారు. పోనీ ప్రియాంకను ఫోకస్ చేద్దామా అంటే, అలా చేయడం వల్ల మంచి ఫలితాలు రావడం గ్యారంటీనా అనే అనుమానం వెన్నాడుతోంది. సోనియా మాత్రం రాహుల్ ను ప్రధానిని చేయాలని భావిస్తున్నారట.
ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడం సోనియా, రాహుల్ కు పెద్ద సవాలే. సమయానికి సరైన సలహాలు ఇవదగ్గ నాయకులు ఎవరూ లేకపోవడం మరో పెద్ద దెబ్బ అంటున్నారు పరిశీలకులు.