ఒక సినిమా, 89 కట్స్. ప్రపంచంలో మరే దేశంలోనూ సాధించని రికార్డు కోసం మన సెన్సార్ బోర్డు కంకణం కట్టుకున్నట్టుంది. ఉడ్తా పంజాబ్ అనే సినిమాకు ఇప్పుడు సినిమా కష్టాలను మించిన బాధలు వచ్చిపడ్డాయి.
ఈ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు పెట్టిన షరతులు వింటే మతి పోతుంది. మొత్తం మీద 89 కట్స్ కు ఓకే చెప్పాలి. తర్వాత పంజాబ్ అనే పేరు ఉండకూడదు. ఈ కథ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది అనిపించే ఏ పేరు గానీ బోర్డు గానీ సన్నివేశం గానీ ఉంకూడదు. అలా అయితేనే సర్టిఫికెట్. లేకపోతే ఇంతే సంగతులు.
ఇది విన్న సినిమా యూనిట్ షాకైంది. సినిమా సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఉత్తర కొరియాలో ఎలా బతుకుతారని ఇంత కాలం అనిపించేది. ఇప్పుడు విమానం ఎక్కాల్సిన పనిలేదు. భారత దేశమే ఉత్తర కొరియాలా తయారైందని ట్వీట్ చేశాడు.
ఆ ట్వీట్ కు కొందరు మద్దతు తెలిపారు.
ప్రస్తుత వివాదంలో బాలీవుడ్ మొత్తం ఈ సినిమా పక్షాన నిలిచింది. ముక్త కంఠంతో మద్దతు పలికింది. సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకుని తీసిన సినిమాను ఇలా ఇబ్బంది పెట్టవద్దని బీటౌన్ పెద్దలు కోరుతున్నారు. సెన్సార్ బోర్డు మాత్రం మెత్తబడటం లేదు. దీంతో న్యాయపోరాటమే శరణ్యమని సినిమా నిర్మాతలు నిర్ణయించారట.
విచ్చలవిడి శృంగార సన్నివేశాలు, అంగాంగ ప్రదర్శనలు, పచ్చి పచ్చిగా లిప్ లాక్ సీన్లున్న సినిమాలు ఎన్నో విడుదలవుతున్నాయి. అడ్డగోలు ఎక్స్ పోజింగ్ సీన్లున్ సినిమాలక ఎ సర్టిఫికెట్ అనే ఒక ట్యాగ్ తగిలించి ఓకే చేస్తున్నారు. వాటిని 18 ఏళ్లలోపు వారు చూడకుండా ఆదేశాలను అమలు చేసే బాధ్యత సెన్సార్ బోర్డుకు లేదు. కాబట్టి నామ్ కే వాస్తే ఎ సర్టిఫికెట్ ఇచ్చేసి చెత్త సినిమాలకు పచ్చ జెండా ఊపుతున్నారు.
పంజాబ్ లో శ్రుతి మించిన డ్రగ్ సంస్కృతి కథాంశంగా తీసిని సినిమా ఉడ్తా పంజాబ్. షాహిద్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్ ముఖ్యపాత్రల్లో నటించారు. పంజాబ్ లో డ్రగ్స్ దందా భారీగా జరుగుతోంది. పొరుగున ఉన్న పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు పంజాబ్ లోకి వస్తున్నాయి. స్వతహాగా పంజాబ్ లోనూ డ్రగ్స్ ఉత్పత్తి జరుగుతోంది. దీనివల్ల యువత ఎలా నాశనం అవుతోందో చూపించారు. అయితే అధికార అకాలీదళ్ కు ఇది నచ్చినట్టు లేదు. దీనివల్ల తమ ప్రభుత్వం చేతకానిది అనే ముద్ర పడుతుందని భయపడినట్టుంది. అందుకే, ఈ సినిమాకు అభ్యంతరం చెప్పిందని వార్తలు వచ్చాయి. ఇంతకీ ఉడ్తా పంజాబ్ థియేటర్ల దాకా ఎగురుకుంటూ వస్తుందో లేక రెక్కలు తెగిన పక్షిలా మూలన పడుతుందో చూద్దాం.