వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా మాట్లాడటంతో మళ్ళీ తెదేపా, వైకాపాల మద్య సరికొత్త యుద్ధం మొదలైంది. అందుకు ప్రతిగా తెదేపా మహాసంకల్పం పేరిట ఇవ్వాళ్ళ జగన్ స్వస్థలం కడపలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సిద్దం అవుతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎన్నికల హామీలను అమలుచేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగించారంటూ ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఇవ్వాళ్ళ పిర్యాదులు చేయబోతున్నారు. జూన్ 13న జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైకాపా విస్త్రుత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. బహుశః తెదేపా కూడా ర్యాలీలు, దిష్టి బొమ్మల దగ్ధం వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు.
రెండు పార్టీలు తమ అస్తిత్వం నిలుపుకొంటూ రాష్ట్ర రాజకీయాలపై ఆధిపత్యం కోసమే ఈ విధంగా పోరాడుకొంటున్నాయని చెప్పవచ్చు. అయితే వాటి పోరాటాలు చూస్తున్న ప్రజలు, అందుకోసం అవి మరీ అంత దిగజారి పోరాడుకోవలసిన అవసరం ఉందా? ప్రజాస్వామ్య పరిధిలో, దానికి అనుగుణంగా అవి మనుగడ సాగించలేవా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో రెండు పార్టీలు కొంచెం అతిగానే ప్రవరిస్తున్నాయని భావిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి పట్ల తెదేపా చాలా సహనంగానే వ్యవహరిస్తోందని చెప్పవచ్చు. కానీ ఆయనే దుందుడుకుగా వ్యవహరిస్తూ, మాట్లాడుతుండటం వలన ఆత్మరక్షణ కోసం వైకాపాతో యుద్ధానికి దిగకతప్పడం లేదు. నిన్న మొన్నటి వరకు ఇతర పార్టీల నేతలని, ప్రజా ప్రతినిధులని పార్టీలో చేర్చుకోవడానికి వెనుకాడిన తెదేపా, ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేలను ఫిరాయింపులకి ప్రోత్సహించడానికి కారణం జగన్ తెదేపాను రెచ్చగొట్టడమేనని అందరికీ తెలుసు. అయితే జగన్ నోరు జారినంత మాత్రాన్న మంచి రాజకీయ పరిణతి గల తెదేపా నైతిక విలువలని పక్కనబెట్టి, అప్రజాస్వామికంగా వ్యవహరించడం కూడా చాలా తప్పే.
ప్రభుత్వం చేయవలసిన పని ప్రభుత్వం చేయాలి. దానిలో లోపాలను ఎత్తి చూపి, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావలసిన బాధ్యత ప్రతిపక్షాలది. తెదేపా ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తుంటుంది కానీ ప్రజాస్వామ్య పరిధిలోనే చేస్తుంది. జగన్ ఆ పరిధి దాటి గంటలో ప్రభుత్వాన్ని కూల్చేస్తాను..ముఖ్యమంత్రిని చెప్పులతో, చీపుర్లతో కొట్టండి.. ముఖ్యమంత్రి బుద్ధి జ్ఞానం, సిగ్గు శరం ఉన్నాయా అంటూ అనకూడని మాటలన్నీ అంటుంటారు. యధారాజ తదా ప్రజా అన్నట్లుగా ఆయన పార్టీలో రోజా, కోడలినాని వంటి నేతలు కూడా అదే స్థాయిలో ముఖ్యమంత్రినే లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తుంటారు.
ముఖ్యమంత్రి అయిపోవాలని చాలా తహతహలాడుతున్న జగన్మోహన్ రెడ్డి, అది సాధ్యం కాకపోవడంతో చాలా అసహనంగా వ్యవహరిస్తున్నారు. ఆ అసహనం ఆయన మాటలలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ అవినీతి, అసమర్ద, లోపాలని ఎత్తి చూపించి వాటి గురించి మాట్లాడితే సరిపోతుంది. కానీ ఆ వంకతో అనుచితమైన భాష వాడుతూ తెదేపాని యుద్ధంలోకి బలవంతంగా లాగుతున్నారు. గాలి ముద్దు కృష్ణం నాయుడు వంటి కొందరు తెదేపా నేతలు కూడా అదే స్థాయిలో వైకాపాకి బదులిస్తుంటారు. వారి ఈ యుద్ధాలన్నీ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే అయితే ప్రజలు కూడా చాలా సంతోషించేవారు. కానీ వాటిని తమ యుద్ధాలకి సాకుగా మాత్రమే ఉపయోగించుకొంటున్నారు. వాటి ఆధిపత్య పోరుని ప్రజలు కూడా నిరసిస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రజలందరూ తమవైపే ఉన్నారని ‘సెల్ఫ్ సర్టిఫై’ చేసుకొంటూ యుద్ధాలు చేసుకొంటున్నాయి. ఇదే ప్రజాస్వామ్య విధానం అని ప్రజలని నమ్మింప ప్రయత్నిస్తున్నాయి.