ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో అధికార తెరాసకి, ప్రొఫెసర్ కోదండరాంకి మద్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో ఒక్క భాజపా తప్ప మిగిలిన అన్ని పార్టీలు, కొన్ని ప్రజాసంఘాలు ప్రొఫెసర్ కోదండరాంకి మద్దతుగా తెరాసతో పోరాడుతున్నారు. చివరికి ఉస్మానియా విద్యార్ధులు కూడా ఆయనకి మద్దతుగా నిలిచి తెరాస తీరుని తప్పు పట్టారు. సాధారణంగా రాజకీయ పార్టీలు ఏవీ కూడా ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఇటువంటి అవకాశాలను వదిలిపెట్టవు. తెలంగాణాలో తన ఉనికిని కోల్పోతున్న తెదేపా కూడా ఈ వ్యవహారంలో ప్రొఫెసర్ కోదండరాంకి అండగా నిలిచి ఆయనతో సరిసమానంగా తెరాస ప్రభుత్వంతో పోరాడుతోంది. తెరాసకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కలలుకంటున్న భాజపా మాత్రం ఇంత వరకు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
తెరాసతో చేతులు కలపడానికి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆసక్తి చూపినప్పటికీ, ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్మొహమాటంగా తిరస్కరించారు కనుక రాష్ట్ర భాజపా నేతలు తెరాసకు అనుకూలంగా వ్యవహరించనవసరం లేదు. కనుక ఊహించని విధంగా అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని, వారు కూడా రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేయవచ్చు కానీ చేయడం లేదు. పార్టీ రాష్ట్ర నేతల అశ్రద్ధ లేదా ఈ వ్యవహారంలో ఏవిధంగా వ్యవహరించాలనే అయోమయమే వారి మౌనానికి కారణమయితే, ఇంకా భాజపా పెద్దపెద్ద కలలు కనడం మానుకొంటే మంచిది.
ప్రొఫెసర్ కోదండరాం మద్దతుగా మాట్లాడుతున్న వారందరూ ఆయనపై అభిమానంతోనో లేదా గౌరవంతోనో తెరాసతో యుద్ధం చేయడం లేదు. దీనిని ఒక రాజకీయ అవకాశంగా భావించి యుద్ధం చేస్తున్నారు. వీలైతే ఆయనని తమ వైపు త్రిప్పుకోవాలనే ఆలోచనతోనే చేస్తున్నారని చెప్పవచ్చు. మరి భాజపా ఆ పని ఎందుకు చేయడం లేదు? ఎందుకు మౌనం వహిస్తోంది? ఎందుకు ఈ అవకాశాన్ని జార విడుచుకొంటోంది? ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఏనాటికైనా భాజపాతో పొత్తులు పెట్టుకోవాలని నిరీక్షిస్తున్నట్లుగానే, తెలంగాణాలో భాజపా కూడా తెరాసతో పొత్తుల కోసం నిరీక్షిస్తోందా? అందుకే మౌనం వహిస్తోందా? ఏమో!