జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తమదేనని, దానిని వీలైనంత వేగంగా పూర్తిచేస్తామని కేంద్రం చాలాసార్లు చెప్పింది. అయితే అందుకు తగ్గట్లుగా నిధులు విడుదల చేయడం లేదు. విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, ఖర్చు చేసిన నిధులకు లెక్కలు అప్పజెప్పడం లేదని, రాత్రికి రాత్రే ప్రాజెక్టు అంచనా వ్యయం రెట్టింపు చేసేసిందని, పట్టిసీమను పోలవరంలో అంతర్భాగంగా పేర్కొంటూ దానికీ బిల్లులు పెట్టిందని పురందేశ్వరి, సోము వీర్రాజు వంటి రాష్ట్ర భాజపా నేతలు చాలాసార్లు విమర్శలు, ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడంలేదని ఆరోపణలు చేస్తున్న తెదేపా ప్రభుత్వం, ముందుగా పోలవరం నిధులకి లెక్కలు అప్పజెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెదేపా నేతలు వారి మాటలలో పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి అందుకు అనుగుణంగా నష్టనివారణ చర్యలు చేపట్టకుండా భాజపా నేతలపై తిరిగి ఎదురుదాడి చేశారు.
తత్ఫలితంగా పోలవరం ప్రాజెక్టుపై లెక్కలు తీయడానికి డిల్లీ నుండి కేంద్ర జలవనరుల శాఖ వ్యవ నిర్ధారిత కమిటీ నిన్న పోలవరం ప్రాజెక్టు క్షేత్ర పర్యటనకి వచ్చింది. ఆ కమిటీలో సభ్యులు వీరేంద్ర శర్మ, ప్రమోద్ నారాయణ్ పోలవరం ఎడమ ప్రధాన కాలువ, హెడ్‌వర్క్స్, స్పిల్‌వే చానల్, స్పిల్‌వే, పవర్ హౌస్ మొదలైన ప్రాంతాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించి, వాటి కోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుల వివరాలన్నిటినీ అధికారుల వద్ద నుంచి సేకరించారు. 2015-16 సం.లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన ఖర్చులను బట్టి ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.32,000 కోట్లు అవసరం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి కేంద్రానికి పంపింది. ఆ లెక్కలను కేంద్ర కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది.
అది ఇచ్చే నివేదికని బట్టే పోలవరానికి ఎంత డబ్బు అవసరమో కేంద్రప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే ఈ కమిటీ ఇవ్వబోయే నివేదిక చాలా కీలకమైనదని స్పష్టం అవుతోంది. ఒకవేళ అది రాష్ట్ర ప్రభుత్వం వేసిన అంచనా వ్యయం రూ. 32,000 కోట్లు తప్పుడు లెక్కల్ని తేల్చి చెప్పినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే అబద్దాలు చెప్పినట్లు కేంద్రం భావిస్తుంది. ఒకవేళ ఆ లెక్కలు, జరుగుతున్న పనుల పట్ల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్లయితే, కేంద్రం భారీగా నిధులు విడుదల చేయవచ్చు కనుక అప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగం పుంజుకొనే అవకాశం ఉంటుంది. కానీ రెవెన్యూ లోటు భర్తీ, రాజధాని నిర్మాణ ఖర్చు వంటి విషయాలలో కాగ్ నివేదికలు, 14వ ఆర్ధిక సంఘం సిఫార్సులు వంటివి సాకుగా చూపించి రాష్ట్రానికి ఈయవలసిన నిధులలో బారీ కోతలు పెట్టింది కనుక ఈ కమిటీ పరిశీలన, దాని నివేదిక కూడా అందుకేనని భావించవచ్చు. ఈ కమిటీ ఇచ్చే నివేదికని చూపి నిధులలో కోత విదించడమే కాకుండా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యానికి తెదేపా ప్రభుత్వమే కారణమని వాదించడానికి కూడా అది ఉపయోగపడుతుంది. అదే జరిగితే, ఇక పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు ఉండవు. కనుక ఇది తెదేపా, భాజపాల మధ్య మళ్ళీ కొత్త యుద్ధం మొదలవడానికి మాత్రం పనికివస్తుంది.