కొమ్మినేని శ్రీనివాస్ పరిచయం అవసరం లేని సీనియర్ సీనియర్ జర్నలిస్టు. ఆయన గత ఏడేళ్ళుగా ఎన్-టీవి న్యూస్ ఛానల్ లో గౌరవ సంపాదకులుగా, ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. ఆ ఛానల్ లో రోజు ఉదయం ఆయన నిర్వహించే ‘కె.ఎస్.ఆర్. లైవ్ షో’ పేరిట రాజకీయ చర్చా వేదిక, ఆ ఛానల్ కే చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ అదే కార్యక్రమం కారణంగా అయన ఉద్యోగం కూడా వదులుకోవలసి రావడం విచిత్రం. ఆ రాజకీయ చర్చా వేదికని ఆయన చాలా నిష్పక్షపాతంగానే నిర్వహించినప్పటికీ, ప్రస్తుతం తెదేపా అధికారంలో ఉంది కనుక సహజంగానే దానిపై విమర్శలు వచ్చేవి. అది తెదేపా ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం కూడా కలిగించడంతో ఆ ఛానల్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చింది. తన వలన ఛానల్ కి ఇబ్బందులు, నష్టం కలగడం ఇష్టం లేక ఆయన తన ఉద్యోగం వదులుకోవడానికి సిద్దపడ్డారు. కానీ అందుకు యాజమాన్యం చాలా రోజులు అంగీకరించలేదు. దానితో కొన్ని నెలలు ఆయన శలవుపై వెళ్ళారు కానీ పరిస్థితిలో మార్పు ఏమీ కనబడకపోవడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఈ విషయం ఆయన తన వెబ్ సైట్ కొమ్మినేని ఇన్ఫో ద్వారా తెలియజేశారు. ఆయన దానిలో ఏమని వ్రాశారంటే “ప్రతి రోజు కె.ఎస్.ఆర్ లైవ్ షోను నిర్వహించడం ద్వారా లక్షలాది మంది ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం వచ్చింది. ఆ షో నుంచి విరమించడానికి కారణాలను ఇంతకుముందే వివరించడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రభువులలో ప్రజాస్వామ్య స్పూర్తి కొరవడింది. భిన్నాభిప్రాయాలకు అవకాశం లేని విదంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి కొంతకాలం వేచి చూడాలని అనుకున్నప్పటికీ జరిగిన కొన్ని పరిణామాలలో ఆత్మగౌరవమే ముఖ్యమని భావించి బయటకు వచ్చేశాను.ఏడేళ్లపాటు ఎన్.టి.విలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు , యాజమాన్యం నన్ను గౌరవంగా చూసుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.ఎన్.టి.వి సంస్థ, యాజమాన్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.”
కొమ్మినేని శ్రీనివాస్ 1978లో ఈనాడుతో తన మీడియా ప్రస్తానం మొదలుపెట్టారు. అప్పటి నుండి 2002వరకు ఈనాడులో సుదీర్గ కాలంపాటు పని చేశారు. ఈనాడు అధినేత రామోజీరావు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ ఆయనకి అత్యంత సన్నిహితంగా మెలిగినివారిలో ఒకరు. కానీ కొన్ని కారణాల వలన ఆయన ఆంధ్రజ్యోతిలోకి మారారు. అందులో 2002-06 వరకు పనిచేశారు. ఆ తరువాత ఎన్.టీవి, టీవి-5లలో పని చేయడం మొదలుపెట్టారు.
2009 నుండి నిన్న మొన్నటి వరకు కూడా ఎన్.టీవీకే పూర్తిగా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ చేతి నుంచి చంద్రబాబు నాయుడు చేతికి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు అధికారంలో కుదురుకోవడానికి ఈనాడు అందించిన పరోక్ష సహాయసహకారాల గురించి అందరికీ తెలుసు. దానిలో కొమ్మినేని శ్రీనివాస్ కూడా చాలా కీలక పాత్ర పోషించారు. కానీ ఎన్-టీవి కె.ఎస్.ఆర్. లైవ్ షోలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, తెదేపాకి వ్యతిరేకంగా కొమ్మినేని వ్యవహరిస్తున్నారనే అభిప్రాయంతో ఆ ఛానల్ పై ప్రభుత్వం చాలా గుర్రుగా ఉంది. చివరికి ఆ కారణంగా ఆయన తన ఉద్యోగాన్నే వదులుకోవలసి వచ్చింది.
తెలంగాణాలో పత్రికాస్వేచ్చకి భంగం కలుగుతోందని అక్కడి తెదేపా నేతలు వాదిస్తున్నప్పుడు, ఈ పరిణామాలు ఆంధ్రాలో కూడా ఇంచుమించు అటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. ఎన్-టీవిలో కొమ్మినేని నిర్వహించే కె.ఎస్.ఆర్.లైవ్ షో వలన తెదేపాకి ఇబ్బంది, నష్టం కలిగి ఉండవచ్చు. కానీ ఆ ఒక్క కార్యక్రమం వలన జరిగే నష్టం కంటే వివిధ సమస్యలు, అంశాలపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షలు, ధర్నాలు, డిల్లీ యాత్రల వలన, ఆయన, వైకాపా నేతలు, సాక్షి మీడియా పనిగట్టుకొని చేస్తున్న తెదేపా వ్యతిరేక ప్రచారం వలన చాలా ఎక్కువ నష్టం జరుగుతోంది. అయినా కూడా తెదేపా వారిని ఏమీ చేయలేకపోతోంది. కానీ పిచుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు కొమ్మినేనిని ఎన్టీవి నుంచి బయటకు వెళ్ళేలా చేసింది.
జగన్మోహన్ రెడ్డిని తెదేపా భరించగలుగుతున్నప్పుడు, ఒక జర్నలిస్ట్ పట్ల సహనం చూపలేదా? జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్షాలు తెదేపాకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాల కంటే కొమ్మినేని ఒక్కరు చేసే కొన్ని వ్యాఖ్యల వలననే తెదేపాకి ఎక్కువ నష్టం కలుగుతుందా? ఆయనను బయటకి పంపించినంత మాత్రాన్న లోకం నోరు మూయించగలదా? అసలు ఒక సీనియర్ జర్నలిస్టు పట్ల ఇంత కక్ష సాధింపు చర్యలు అవసరమా? దాని వలన ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళతాయి? ప్రజలు ఏమనుకొంటారు? అని తెదేపా ఒకసారి ఆలోచిస్తే బాగుండేది.
ఆయన ఎన్-టీవి న్యూస్ ఛానల్ నుంచి బయటకు రాగానే సాక్షి మీడియా ఆయనను సాదరంగా తమ ఛానల్ లోకి ఆహ్వానించినట్లు, అందుకు ఆయన అంగీకరించినట్లు తాజా సమాచారం. ఈ విషయాన్ని ఆయన ఇంకా దృవీకరించవలసి ఉంది. ఒకవేళ ఆయన సాక్షిలో చేరడం నిజమైనట్లయితే, ఇక నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి మనోభావాలకు, కోర్కెలకు, వ్యూహాలకు అద్దం పట్టేవిధంగానే పనిచేయవలసి ఉంటుంది. ఆత్మగౌరవం కంటే ఉద్యోగం ముఖ్యం కాదనుకొన్నప్పుడు ఆయన సాక్షిలో ఆత్మగౌరవం కాపాడుకోగలరా? అనే సందేహం కలుగుతోంది.