ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు వ్యక్తులు మీడియాలో హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. వారు ఆంధ్రాలో ముద్రగడ పద్మనాభం. తెలంగాణాలో ప్రొఫెసర్ కోదండరాం. ఇద్దరూ వేర్వేరు సమస్యపై మాట్లాడుతున్నప్పటికీ వారి పోరాటం మాత్రం ప్రభుత్వాల మీదనే కావడంతో వారికీ ప్రభుత్వాలకి మద్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆంధ్రాలో ముద్రగడకి నేరుగా ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వడం లేదు కానీ ప్రతిపక్ష నేతలు వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణాలో మాత్రం అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రొఫెసర్ కోదండరాంకి అండగా నిలబడి తెరాస ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నాయి.
కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ చేస్తున్న పోరాడటం తప్పు కాదు..చట్ట వ్యతిరేకం అంతకంటే కాదు. కానీ కులసమీకరణాలు, ఓటు బ్యాంక్ లెక్కల కారణంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఆయన పోరాటంలో నేరుగా పాలు పంచుకోవడానికి వెనుకాడుతున్నాయి. పైగా ఆయనతో తమకేమీ సంబంధం లేదని వైకాపా చెప్పుకొంటుంటే, ఆయన కూడా వైకాపా తన వెనుకలేదని పదేపదే చెప్పుకోవలసి వస్తోంది. కానీ ఆయన జగన్ సీక్రెట్ ఏజంట్ అని తెదేపా నేతలు గట్టిగా వాదిస్తుండటంతో ముందు ఆ ట్యాగ్ వదిలించుకోవడానికే ఆయన మరో యుద్ధం చేయవలసి వస్తోంది.
తెలంగాణాలో తెరాస నేతలు కూడా ప్రొఫెసర్ కోదండరాం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని వాదిస్తున్నారు కానీ ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆ వాదనని నమ్మడం లేదు. ఆయనకి మద్దతు పలికేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేనందున తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఆయనకి బహిరంగంగానే మద్దతు పలుకుతున్నాయి. అయితే ఆయన కూడా ఇంతవరకు అన్ని రాజకీయ పార్టీలతో సమానదూరం పాటిస్తూనే ఉన్నారు.
వారిరువురూ సరైన అంశంతోనే ప్రభుత్వంతో పోరాటం మొదలుపెట్టినప్పటికీ, వారిలో ముద్రగడ తన లక్ష్యానికి కొంచెం దూరం అయినట్లు కనిపిస్తున్నారు. పైగా తుని విద్వంసం, ఆ తరువాత ఆయన చాలా అనిశ్చిత వైఖరి ప్రదర్శించడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ లేఖలు వ్రాయడం, మళ్ళీ ఇప్పుడు తుని విద్వంసానికి కారకులుగా అనుమానిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘ విద్రోహ శక్తులని తక్షణమే విడిచిపెట్టాలని కోరుతూ కిర్లంపూడిలో దీక్షకి కూర్చోవడం వంటి అనేక కారణాల వలన, ఆయన విమర్శలు మూటగట్టుకొంటున్నారు. ఒకప్పుడు ఆయనకి భయపడిన ప్రభుత్వం, ఇప్పుడు ఇదే కారణాల చేత ఆయనపై చాలా నిర్భయంగా విమర్శలు, ఆరోపణలు చేయగలుగుతోంది.
తెలంగాణాలో తెరాస మంత్రులు, నేతలు కూడా ప్రొఫెసర్ కోదండరాంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ప్రజలు, ప్రతిపక్షాలు, విద్యా, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి రావడంతో కొంచెం వెనక్కి తగ్గవలసి వస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశిస్తే అప్పుడు ఇంకా వేడి పెరుగుతుంది. అదే ఆయన తన తెలంగాణా రాజకీయ జేయేసికే పరిమితం అయితే బహుశః కొన్ని రోజులలోనే ఈ వేడి చల్లారిపోవచ్చు. కానీ ఆంధ్రాలో ముద్రగడ పద్మనాభం ఉద్యమం ఏ మలుపు తిరుగబోతోందో ఎవరికీ తెలియని పరిస్థితి కనిపిస్తోంది.