ఎన్టీఆర్ సూపర్ డాన్సర్.. ఇది అందరూ చెప్పే మాటే. ఎన్టీఆర్‌తో డాన్స్ చేయడం మామూలు విషయం కాదని కథానాయికలే ఒప్పుకొంటారు. పవన్ కల్యాణ్ అంతటివాడే.. ఓ సందర్భంలో ఎన్టీఆర్ డాన్సుల్ని మెచ్చుకొన్నాడు కూడా. పదిహేనేళ్లుగా తన డాన్సులతో అబ్బుర పరుస్తూనే ఉన్నాడు తారక్. ఇప్పుడు జనతా గ్యారేజ్‌లో కూడా అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నాడట. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ షూటింగ్ ఇప్పుడు టాకీ నుంచి పాటలకు షిఫ్ట్ అయ్యింది. అసలే నాన్నకు ప్రేమతో హిట్ అయిన మూడ్‌లో ఉన్నాడేమో.. ఈసినిమాలో మరింతగా విజృంభించి స్టెప్పులు వేయాలని చూస్తున్నాడట ఎన్టీఆర్. నిజానికి నాన్నకు ప్రేమతో సినిమాలో స్టెప్పులు వేసే అవకాశం అంతగా రాలేదు. అందుకే.. జనతా గ్యారేజ్‌తో తనకు తానుగా స్పేస్ తీసుకొన్నాడట.
గురువారం నుంచి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ సెవెన్ ఏకర్స్‌లో ఎన్టీఆర్, సమంతలపై జనతా గ్యారేజ్ పాట తెరకెక్కిస్తారు. దీనికి శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేయనున్నారు. శేఖర్ ఎన్టీఆర్ కోసం అదిరిపోయే స్టెప్పుల్ని కంపోజ్ చేశాడట. ఈ ఆల్బమ్‌లో ఇదే పరమ మాస్ పాట అని తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే ఇందులో ఓ సిగ్నేచర్ స్టెప్‌ని క్రియేట్ చేశాడట శేఖర్ మాస్టర్. ఆ స్టెప్పు అభిమానుల్ని మైమరపిస్తుందని చిత్రబృందం చెబుతోంది. మరి ఎన్టీఆర్ డాన్సింగ్ మేళా ఎలా సాగిందో తెలియాలంటే జనతా గ్యారేజ్ వచ్చే వరకూ ఆగాల్సిందే.