ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర విమర్శ చేయొచ్చు గాని మా వాళ్లు ఇంతగా ఉలికిపడటం ఎందుకో అర్థం కాదు అన్నారు టిఆర్ఎస్ ప్రజాప్రతినిది ఒకరు.ఇలాటి అభిప్రాయం నిన్ననే వ్యక్తమైందని చెప్పుకున్నాం. ఆయనపై దాడీ పెరిగిందీ, దాంతోపాటు ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఎందుకు హీరోను చేస్తున్నారనే సందేహమూ పెరిగింది. మేము జెఎన్‌యులో కన్నయ్య కుమార్ పట్ల చేసినట్టే టిఆర్ఎస్ కోదండపట్ల చేస్తోంది అన్నారొక బిజెపి ప్రతినిధి. మాలాటి వారినెవరినో ఖండించమని చెబితే పోయేదానికి ఇంతమంది కట్టకట్టుకుని మీద పడాలా అని మరో నాయకుడు అన్నారు. కోదండరాం మేధావి గనక అలాటి మేధావి ముద్ర వున్నవారితో మాట్లాడిస్తే పోయేది కదా.. అని మరో నాయకుడు చప్పరించారు. ఏమైతేనేం టిఆర్ఎస్ ప్రతిస్పందన అతిస్పందనగా వుందనేది బలమైన అభిప్రాయంగా వుంది. ఇందుకు భిన్నంగా మాట్లాడేవారూ వున్నారు. కెసిఆర్ నిరాహారదీక్షకు కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత కదా జెఎసి ఏర్పడింది..అప్పుడు కూడా జయశంకర్ ఆనారోగ్యం వల్ల ఆయన సలహా మేరకు కోదండ ఎంపికైనారు. ఆయన పిలుపులు ఇస్తుంటే వాటి ఖర్చులు కష్టాలు భరించిందెవరు మేము కాదా? అని టిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆయన వెనక వున్న సంఘాలలో ఒక్కటి కూడా ఇప్పుడు లేదనీ, ఇప్పుడున్న వారెవరికీ ప్రజా పునాది లేదనీ వారంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నేతలది మరో విధమైన వాదన. ఆ రోజున కెసిఆర్ స్వభావం కనీసంగా పట్టించుకోకుండా ఏకపక్షంగా అనుసరించిన రోజున కోదండరాం కొంచెమైనా ఆలోచించారా అని వారు ఆక్షేపిస్తున్నారు.
ఇది ఇలా వుంటే కోదండరాం వెనక మావోయిస్టుల ప్రభావం వుందనే భావాన్ని ఒక సీనియర్ పాత్రికేయుడు వ్యక్తం చేశారు.స్వతహాగా ఎంఎల్ పార్టీ మనిషి. అప్పుడు జనం వున్నారు గనక కెసిఆర్ వెనక నడిచినా మళ్లీ పాత ఫక్కీలో వ్యవహరిస్తున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? అని ఆయన విశ్లేషించారు. నిజానికి కోదండరాంను కాంగ్రెస్ టిడిపిలు భుజాన వేసుకున్నంతగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వత్తాసుపలక్కపోవడం గమనార్హం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంఎల్ పార్టీలతో సహా ఐక్యవేదికలు ఏర్పాటు చేసినప్పుడు కోదండరాం వారితో కలసి రాలేదు. తను విడిగా స్వంతంగా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఆలోచన ఏమిటో తెలియాలనే భావన సిపిఎం వ్యక్తం చేసింది. వ్యక్తిగా ఆయనపై టిఆర్ఎస్ దాడి చేయడం సరికాకపోయినా తాము అదే స్థాయిలో సమర్థించవలసిన అవసరం ఏమిటని వారు భావిస్తున్నారు. బిజెపి కూడా పరిమితంగానే స్పందించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టిడిపిలే ఎక్కువగా సంఘీభావం తెల్పడంతో వారే ఆయనను ముందుకు నెడుతున్నారనే టిఆర్ఎస్ వాదనకు బలం వస్తుందని కొందరంటున్నారు. ఇక కోదండరాం మాత్రం ఎవరు ఏమన్నప్పటికి తాము ప్రజల తరపున పోరాడతామని వ్యాఖ్యానించారు. జెఎసి నాయకుడుగా పనిచేశారు గనక ఆయన మాటలకు కొంత విలువ వున్నా రాజకీయ క్రీడపై ఆయన ప్రభావం వుండబోదని పాలకపక్షం దీమాగా వుంది.