తుని విద్వంసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఏడుగురు వ్యక్తులను బేషరతుగా విడుదల చేయనందుకు ముద్రగడ పద్మనాభం రేపు ఉదయం నుంచి కిర్లంపూడిలో తన నివాసంలో నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్లు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. జిల్లా ఎస్పి రవిప్రకాష్ ఆయన ఇంటి చుట్టూ బారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, ముందు జాగ్రత్త చర్యగా కిర్లంపూడికి వెళ్ళే మార్గాలన్నిటినీ మూసివేయించారు. కిర్లంపూడితో బాటు అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో కూడా ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసులను మొహరించారు.
కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ దంపతులు గతంలో ఆమరణ నిరాహరణ దీక్షకి కూర్చొన్నప్పుడు పరిస్థితులకి, ఇప్పటికీ చాలా తేడా ఉంది. అలాగే ప్రభుత్వ వైఖరిలో కూడా చాలా మార్పు వచ్చింది. ఆయన మొదటిసారి దీక్షకి కూర్చొన్నప్పుడు అదొక మంచి ఆశయంతో చేస్తున్నది కనుక ప్రజలు కూడా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. బహుశః అందుకే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి, ఆయన డిమాండ్లకు అంగీకరించింది.
కానీ ఈసారి ఆయన దీక్ష ఉద్దేశ్యం వేరు. అది ఎవరికీ ఆమోదయోగ్యంగా లేదు. ఒక తీవ్ర నేరానికి పాల్పడిన సంఘవిద్రోహ శక్తుల విడుదల చేయమని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షకి కూర్చోంటున్నారు. అది కాపుల సంక్షేమానికి సంబంధం లేని అంశం కావడంతో వారు కూడా ఆయనని సమర్దించలేని పరిస్థితి స్వయంగా కల్పించుకొన్నారు.
అరెస్టయిన వారు నిజంగా అమాయకులే అయినట్లయితే, ఆయన కోర్టులో పిటిషన్ వేసి ప్రభుత్వాన్ని, పోలీసులని కోర్టుకి ఈడ్వవచ్చు ఆవిధంగా చేసి ఉండి ఉంటే నిజమేమిటో అందరికీ తెలిసి ఉండేది. కానీ ఆవిధంగా చేయకుండా మళ్ళీ నిరాహార దీక్షకి కూర్చోవడం ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన వ్యక్తులని బేషరుతుగా విడిచిపెట్టమని ముద్రగడ కోరడం చట్ట వ్యతిరేకం కూడా. ఒకవేళ ఆయన ఒత్తిడికి లొంగి వారిని విడుదల చేస్తే, రేపు ప్రభుత్వం, పోలీసులు న్యాయస్థానానికి జవాబు చెప్పుకోవలసి వస్తుంది. వారిని విడుదల చేయాలంటూ నిరాహార దీక్ష చేయడం ద్వారా ముద్రగడ స్వయంగా శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారనే ఆరోపణతో పోలీసులు ఆయనని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
ఆయన లక్ష్యం కాపులకు రిజర్వేషన్లు సాధించడం గురించి ఉద్యమించి ఉంటే కాపు కులస్తులే కాక సమాజంలో చాలా మంది ఆయనకి మద్దతు పలికేవారు. కానీ ఇటువంటి కారణాలతో దీక్షలు చేస్తే ఆయనకీ ఎవరూ మద్దతు పలకకపోవచ్చు. అప్పుడు ఆయనే ఒంటరివారవుతారు. మళ్ళీ నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంది. ముద్రగడ వంటి ఒక పరిణతి చెందిన సీనియర్ నేత ఇన్ని తప్పటడుగులు వేయడం చాలా ఆశ్చర్యంగానే ఉంది. అవి తప్పటడుగులు కావని ఆయన భావిస్తున్నట్లయితే, తెదేపా నేతలు వాదిస్తున్నట్లు ఆయన ప్రజలు, మీడియా దృష్టిని ఆకర్షించడానికీ ఆవిధంగా చేస్తున్నారనుకోవలసి ఉంటుంది లేకుంటే జగన్ సూచనల మేరకే ఆ విధంగా వ్యవహరిస్తున్నారేమోనని అనుమానించవలసి వస్తుంది. చట్ట సంబంధమైన ఈ వ్యవహారంలో ముందుకు వెళ్ళే ముందు అది సరైనా నిర్ణయమేనా కాదా అని ముద్రగడ మరొకమారు ఆలోచించుకొంటే మంచిదేమో?