ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ఒక సంచలన ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లోగా సాక్షి ఆస్తులను స్వాధీనం చేసుకొనే ప్రక్రియ మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. అక్రమాస్తుల కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర శాసనసభ ఇదివరకు ఒక తీర్మానం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపగా దానిని కేంద్రప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే ఆమోదించింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేస్తే అది చట్టబద్దమే అవుతుంది. దాని ద్వారా అవినీతికి పాల్పడిన వారి ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసుకొనేందుకు వీలు కలుగుతుంది. అలాగే అటువంటి కేసులలో కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకొన్న ఆస్తులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ కి చెందిన కొన్ని ఆస్తులను ఈడి అటాచ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటిని తన అధీనంలోకి తీసుకోబోతోందా లేక ప్రత్యేక కోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఆయువు పట్టు వంటి సాక్షి మీడియా సంస్థలనే నేరుగా స్వాధీనం చేసుకొబోతోందా లేదా జగన్మోహన్ రెడ్డిని బెదిరించడానికే యనమల ఆవిధంగా అన్నారా అనే విషయం త్వరలో తేలుతుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే సాక్షి మీడియాని స్వాధీనం చేసుకొనే ప్రయత్నాలు చేస్తే, రాష్ట్రంలో వైకాపా ప్రళయం సృష్టించడం ఖాయం. అలాగే దానిపై న్యాయపోరాటం చేయడం కూడా తధ్యం కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆ పర్యవసానాల గురించి బాగా ఆలోచించి అడుగు ముందుకు వేయడం మంచిది.