ముద్రగడ పద్మనాభం ఇంతవరకూ చేసిన ప్రతీ నిరాహార దీక్షకు ముందుగానే అప్పటి రాష్ట్రప్రభుత్వాలకు ముద్రగడకూ మధ్య ప్రయివేటు సంప్రదింపులకు ప్రభుత్వ పక్షాన ఒకరిద్దరితో మధ్యవర్తుల వ్యవస్ధ వుండేది. సంభాషణలు ఒక కొలిక్కి వచ్చాక వేరే మధ్యవర్తులు తెరమీదికి వచ్చి రాజీ పరిష్కారాలతో ఆందోళనను విరమింపజేసేవారు. గత దీక్షా సమయంలో కూడా ప్రభుత్వం తరపున బొడ్డు భాస్కరరామారావు, తోట త్రిమూర్తులు ప్రభుత్వం వైపునుంచి తొలి కమ్యూనికేటర్లు అయ్యారు.
ఈ సారి రాష్ట్ర ప్రభుత్వమూ, తెలుగుదేశం పార్టీ అలాంటి కమ్యూనికేషన్ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. ముద్రగడ డిమాండుకి దిగివచ్చేది లేదన్న సంకేతాన్ని కటువుగా ప్రజల్లోకి పంపాలనే భావిస్తోంది. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నామంటే సామాన్యులు, తటస్ధులు అయిన ప్రజానీకం మద్దతు ప్రభుత్వానికి తప్పక వుంటుంది. అది అవసరం కూడా. ముద్రగడ దీక్ష విరమించిన వెంటనే రైళ్ళు తగల బెట్టిన అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవడం మొదలు పెట్టి వుంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించనవసరం లేదు.
కాపులను బిసిల్లో చేరుస్తామన్న హామీగురించి ముద్రగడ పదే పదే గుర్తుచేశాకే మేల్కొన్న ప్రభుత్వం డిఫెన్సులో పడిపోయింది. ప్రతిష్టపోకుండా డిమాండ్లకు నెరవేర్చడం మొదలు పెట్టింది. విభజన అనంతరం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో కాపుల ప్రాబల్య, ప్రాధాన్యతల రీత్యా వారి మద్దతు కోల్పోరాదన్న వ్యూహంతో చంద్రబాబు ప్రభుత్వం ఇతర కులాల వారికి ఒళ్ళు మండిపోయే స్ధాయిలో కాపుల్ని పేంపర్ చేయడం మొదలు పెట్టింది. అయితే ఎట్టి పరిస్ధితుల్లోలూ ఈ క్రెడిట్ ముద్రగడకు దక్కరాదన్న ఎత్తుగడతో కాపు మంత్రులు, తెలుగుదేశంలో కాపు నాయకులు ముద్రగడపై విమర్శలు ప్రారంభించారు.
ప్రభుత్వ ప్రచారం చేసినట్టు వాస్తవంగా జరగడం లేదని ముద్రగడ విమర్శలు మొదలు పెట్టారు. ఆయన ప్రజల్లో వీకౌతున్నారని అంచనా వేసుకున్న ప్రభుత్వం రైళ్ళు తగలబెట్టిన కేసుల్లో దుండగులను పట్టుకోవడం మొదలు పెట్టింది. ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చిన ప్రకారం ఈ సంఘటనలపై బేషరతుగా కేసులు రద్దు చేయాలని నిరాహారదీక్ష కు ముద్రగడ సిద్ధమైపోయారు.
కక్షసాధింపులు వుండకూడదని, నిరపరాధులపై కేసులు పెట్టకూడదని అప్పట్లో ముద్రగడ షరతు విధించారు. ఇపుడేమో బేషరతుగా కేసులు రద్దుచేయాలని డిమాండు చేస్తున్నారు. అసాంఘిక శక్తులను వెనకేసుకు రావడంలో న్యాయమేమిటో, ధర్మమేమిటో ఆయనకే తెలియాలి…దీనికి సామాన్య ప్రజానీకం మద్దతు వుండదని ముద్రగడ గ్రహించుకోవాలి.
ముద్రగడకు వ్యతిరేకంగా కాపు మంత్రుల, కాపు నాయకులు మాత్రమే మాట్లాడించే నంగితనాన్ని, అల్పత్వాన్ని తెలుగుదేశ ప్రభుత్వం వొదులు కోవాలి. ఈ నంగితనం వల్లే అసాంఘిక శక్తుల్ని కఠినంగా అణచి వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందా? లేక వున్నట్టు నమ్మింపజేస్తోందా అనేది భవిష్యత్తు పరిణామాలు తేల్చేస్తాయి.
చంద్రబాబు ప్రాపకం వల్ల మంత్రులైపోయిన కాపు ప్రముఖులెవరూ నాయకుడైన ముద్రగడకు సాటిరారు…ఈసారి కూడా ప్రభుత్వం దిగిరాక తప్పదు అని కాపుకులస్ధుడైన తెలుగుదేశం ప్రముఖుడు ఒకరు అన్నారు. ఎలా సాధ్యం అంటే రిమాండ్ లో వున్న వాళ్ళకి బెయిల్ ఇవ్వవొద్దని ప్రాసిక్యూటర్ వాదించకుండా మౌనం పాటించడం ద్వారా …వాళ్ళకి బెయిల్ వచ్చేలా చూడటం ద్వారాఅని ఆయన నవ్వేశాడు.