`మందు విజన్ 2020′ మహాదొడ్డదని మద్యపానప్రియులంతా ఏకగ్రీవంగా అంగీకరించేసి ఛీర్స్ చెప్పుకున్నారు. ఇప్పటికే కొత్తపోకడలు తొక్కిన ఈ విజన్ రాబోయే కాలంలో అనేకమార్పులను తీసుకువస్తుందని వారంతా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో టివీ999 ప్రతినిధి ఒక మందుబాబుని పలకరిస్తే…
`హలో మీ పేరు…?’
`మందుబాబు’
`అదికాదు, మీ అసలుపేరు’
`నా అసలు పేరు ..పేరు… గుర్తుకురావడంలేదు. బాబుగార్ని అడిగి చెబుతాను’
`మధ్యలో ఆయన్ని అడగడం ఎందుకు ?’
` మీకు తెలియదా, మందుబాబుల లిస్టంతా ఆయనదగ్గరే ఉంది. పేర్లన్నంటినీ కంప్యూటరైజ్డ్ చేశారు. మనం సారీ మేము ఎక్కడైనా పడిపోతే ఫింగర్ ఫ్రింట్ సాయంతో పేరుగట్రా అన్నీ తెలిసిపోతాయన్నమాట. అదీ బాబుస్టైల్’
`మాకు తెలియనివి మీకెలా తెలుస్తున్నాయి !’
`మీ మీడియావాళ్లకు చెప్పనవికూడా మాకు బాబుగారు చెబుతారు.హ్హీహ్హీహ్హీ అదే మా ఫ్రెండ్ షిప్ బాండ్..హ్హీహ్హీహ్హీ..సరే, చెబుతాను వినండి. మా బాబుగారు ఇప్పుడు హైటెక్ పద్ధతిలో మందు సరఫరాచేసేపనిలో ఉన్నారు తెలుసా..’
`తెలియదు, హైటెక్ విధానమంటే..?’
`బాబుగారివన్నీ హైటెక్ ఆలోచనలేకదా… మందుబాబులు వీధినపడి కష్టాలు పడకుండాఉండేందుకు చాలా ఏర్పాట్లు చేస్తామన్నారు బాబుగారు’
` ఏం కష్టాలు పడేవారు?’
`ఓస్సీ..మీ మీడియావాళ్లకు ఇదికూడా తెలియదా… సరే చెబుతాను… ఎక్కడో మందుకొట్టి వీధుల్లోకి వెళితే మాకు రక్షణఏది ? పాపం బాబుగారు మాలైఫ్ గురించి కుడా ఆలోచించారు. `మద్యపానప్రియుల సురక్షా పథకం’లాంటిది ప్రవేశపెడతారట.
`అవునా, అదేంటీ !’
`బాబుగారి ఆలోచనలు సగం మీకు తెలుస్తాయి. కానీ మాలాంటి మందుబాబులకు పూర్తిగా తెలుస్తాయి. మందుబాబులు రోడ్డుమీద పడిపోకుండా వారికి అనేక సదుపాయాలను బాబుగారు ఈ పథకం క్రింద తీసుకొచ్చారు. ఇప్పటికే ఎస్ఎంఎస్ చేస్తే మందుబాటిల్ ఇంటికేవచ్చి వాలే పద్ధతి తీసుకురావాలనుకున్నారుకదా.. ఇంకా బాబుగారిమదిలో ఏమేమీ ఆలోచనలు తెలిస్తే మీకు ఫుల్ బాటిల్ తాగినంత కిక్కువస్తుంది. చెబుతాను వినండి..
1. మందుబాబులకోసం ఆన్ లైన్ సేవలు. ఇందుకోసం మందుసేవ అంటే ఈసేవ, మీసేవలాగాఅన్నమాట, దీన్ని ప్రవేశపెడతారు.
మందుబాబులుకు ఎలాంటి సాయం కావాలన్నా 666 వాహనం ఏర్పాటుచేస్తారు. దానికి కాల్ చేస్తే చాలు రివ్వునవచ్చి మందుకావాలంటే మందు ఇస్తుంది. లేదా ఇతర సేవలు చేస్తుందన్నమాట.
2. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు తత్కాల్ సేవలు కూడా ఉంటాయి. మందు సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు వాటిధరలపై సబ్సిడీ ఇస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా కార్డులు జారీచేస్తారు.
3. ప్రస్తుతం పెట్రోల్ పైపులైన్లు, గ్యాస్ లైన్లు ఉన్నట్టుగానే ముందుముందు లిక్కర్ పైప్ లైన్లు కూడా వచ్చేస్తాయి. రాష్ట్రంలో ఎక్కడైనాసరే, నీళ్లకు ఇబ్బందిరావొచ్చేమోకానీ, మందుకుమాత్రం ఇబ్బందిరాకుండా ఈ పైప్ లైన్ల ద్వారా మందు నిరంతరాయంగా ప్రవహించేలా చూస్తారన్నమాట.
4. ఇంటింటికీ లిక్కర్ కనెక్షన్ తీసుకురావాలన్నది పెద్దాయన ఆలోచన. మీటనొక్కితే సీసా ఫుల్ అయ్యేలా ఏర్పాటు చేస్తారు.
5. మరో ఐదేళ్లలో అంటే 2020నాటికి ఆంధ్రప్రదేశ్ ని `మద్యాం’ధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
6. షాపింగ్ మాల్స్, రైతుబజార్, సినిమాహాళ్లలో కూడా లిక్కర్ అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు.
7. మందుబాబుల సంక్షేమంకోసం వారికి `మందుశ్రీ’ కార్డులు ఇస్తారు. ఈ కార్డులున్నవారు డబ్బులు వెంటనే ఇవ్వకున్నా మద్యం సరఫరాచేసి తర్వాత బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకుంటారన్నమాట.
8. `మందు స్వేచ్ఛ ప్రదేశ్’ పేరిట చైతన్యం కలిగిస్తారు. జాతీయస్థాయిలో ఉద్యమించి `మందు స్వేచ్ఛభారత్’ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకుపోతారు. `స్వేచ్ఛగా మందుతాగలేని బతుకూ ఒక బతుకేనా’ అన్నదే ప్రధాన నినాదం.
9. సుదీర్ఘ కొనుగోలుదారులను గుర్తించి వారికి ఏడాదికి ఒకసారి రకరకాల ప్రోత్సాహక అవార్డులు ఇస్తారు. ఐదేళ్లు తాగినవారికి `మందుచుక్క’ అవార్డు, పదేళ్లు తాగితే `మందు వీరుడు’, పదిహేనేళ్లు తాగితే `ముందు రత్న’ అవార్డులు ఇస్తారన్నమాట.
10 సీనియర్ సిటిజన్స్ కు రాయితీలు ఇస్తారు. వారికి అవసరమైతే `హెల్పర్’ ని ఏర్పాటుచేస్తారు.
బాబుగారి మదిలో ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయండీ… అయితే కొంతమంది గిట్టనివాళ్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎస్ఎంఎస్ కొడితే ఇంటికే మద్యం అన్నందుకే ఓ తెగ ఇదైపోతున్నారు. ఇల్లే బారైతే నేరాలు పెరిగిపోతాయంటున్నారు. డోర్ డెలివరీ సరికాదని తెగఫీలైపోతున్నారు. ఇదంతా ట్రాష్. అవాస్తవిక ఆరోపణలు. మందుబాబులు నేరగాళ్లుకారు. నేరం చేయాలనుకున్నా, మందుతాగితే బుద్ధిగా తొంగుంటారు. గిట్టనివాళ్లు మామీదవేసే నిందలుఇవి. ర్యాగింగ్ మరణాలకీ, అత్యాచార సంఘటనలకీ, దారిదోపిడీలకీ మందుబాబులతో సంబంధంలేదని మీ టివీద్వారా నేను సగర్వంగా తలియజేస్తున్నాను. `మందుబాబుల సురక్షాపథకం’ తీసుకురావాలన్న మాబాబే మాకు `బీరుబాబు’. ఆయనే మాకు `బీరుబలుడు’. ఆయనే మాకు `భీరోదాత్తుడు’. ఆయనే…
ఇలా అంటుండగానే సదరు మందుబాబు డోసెక్కువై పడిపోయాడు.
టివీ999 రిపోర్టర్ కి ఏమీ అర్థంకాలేదు. ఈ వార్తను వేయాలా, మానాలా… తెలియక అక్కడే ఉన్న ఫుల్ బాటిల్ చేతిలోకి తీసుకున్నాడు.
– కణ్వస