ఇంట్లో ఈగల మోత…బయట పల్లకీల మోత అనే నానుడి ప్రధాని నరేంద్ర మోడీకి అక్షరాల సరిపోతుందనిపిస్తుంది. అంటే దానర్ధం ఆయన పరిపాలనా సమర్దతని ప్రశ్నించడం కాదు. ఆయన పట్ల దేశంలో ప్రజలు, రాజకీయ పార్టీలు, విదేశాలలో ప్రవాస భారతీయులు, ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరుని బేరీజు వేయడం మాత్రమే.
డిల్లీ, బిహార్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఎంతగా ప్రచారం చేసినప్పటికీ ప్రజలు ఆయన మాటలని పట్టించుకోకుండా తమకు నచ్చిన పార్టీలకే ఓట్లు వేసుకొన్నారు. ఇక దేశంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర పక్షాలు, మళ్ళీ వాటిలో సోనియా రాహుల్ గాంధీలు ఆయనపై పార్లమెంటు లోపలా బయటా ఎంతగా విమర్శలు గుప్పిస్తుంటారో అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే భాజపాలోనే లాల్ కృష్ణ అద్వానీ వంటి సీనియర్ నేతలు నేటికీ ఆయనకీ వ్యతిరేకంగా అసమ్మతి రాగాలాపన చేస్తూనే ఉంటారు. గత ఏడాది బిహార్ ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా ఎందఱో కళాకారులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు మోడీ పరిపాలనలో మత అసహనం పెరిగిపోతోందని ఆరోపిస్తూ తమ తమ అవార్డులని వాపసు చేయడం అందరూ చూశారు.
ఇవన్నీ ఇంట్లో ఈగల మోత అనుకొంటే, ఆయన ఏ విదేశీగడ్డపై అడుగుపెట్టినా ఆయనకి అక్కడి ప్రవాస భారతీయులు, ప్రభుత్వాలు నీరాజనాలు పడుతుంటారు.
అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయసభల సభ్యులని ఉద్దేశ్యించి ఆయన చేసిన ప్రసంగానికి సభ్యులు పులకించిపోయి పదేపదే లేచి నిలబడి చప్పట్లు కొట్టడమే అందుకు నిదర్శనం. ఆయన తన మాటల గారడితో తాత్కాలికంగా వారిని కట్టిపడేయడమే కాదు..ఆయన అడుగుపెట్టిన ప్రతీచోట ప్రతీసారి కూడా భారతదేశానికి లేదా భారతీయులకి ఏదో ఒక మేలు జరిగేందుకు దోహదపడుతుంటారు. అందుకు ఉదాహరణలు కోకొల్లలు.
ఇటీవల ఒక సర్వే నివేదికలో మోడీ పాలన పట్ల దేశంలో 50శాతం పైగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొంది. ఆ సర్వే 120 కోట్ల మంది భారతీయుల అభిప్రాయానికి అద్దం పట్టకపోయినా, అది ఆయనకి సానుకూల సంకేతంగానే భావించవచ్చు. వివిధ రాష్ట్రాలలో ప్రజలు ఎన్నికల సమయంలో మోడీ మాటను పట్టించుకోకపోయినా, ఆయన పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం గమనిస్తే, ప్రాంతీయ పార్టీల ప్రభావం అధికంగా ఉండే రాష్ట్రాలలో జరిగే ఎన్నికలకి, ఆయన సమర్దతకి ముడిపెట్టి చూడనవసరం లేదని స్పష్టం చేస్తున్నట్లుంది.
అమెరికన్ కాంగ్రెస్ సభ్యులని ఉద్దేశ్యించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో ప్రధానంగా భారత్, అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా దేశానికి పెట్టుబడులను ఆకర్షించడం, ఉగ్రవాదంపై సమిష్టి పోరు, దాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కి అమెరికాని దూరం చేయడం అనే మూడు లక్ష్యాలు కనిపించాయి. ఆ లక్ష్యాలను ఆయన సాధించగలిగారా లేదా అనే విషయం రానున్న రోజుల్లో క్రమంగా స్పష్టమవుతుంది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం వలననే ఆ దేశం పాకిస్తాన్ కి సరఫరా చేయాలనుకొన్న అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలను సరఫరా కాకుండా అడ్డుకోగలిగారు. కనుక ఈ పర్యటనలో లక్ష్యాలను కూడా ఆయన తప్పకుండా సాధించే అవకాశాలున్నాయని భావించవచ్చు. కానీ అతివాదిగా వ్యవహరిస్తున్న డోనాల్డ్ ట్రంప్ ఒకవేళ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయితే, ఆయనని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విధంగా ఆకట్టుకోగలరా లేదా అనే దానిపై ఇరుదేశాల సంబంధాలు ఆధారపడి ఉంటాయి.