తెలంగాణా రాష్ట్రంలో తెదేపా, భాజపాలకు తమ పొత్తులపై స్పష్టత ఏర్పడింది కానీ ఆంధ్రాలో మాత్రం అవి ఇంకా అయోమయంలోనే ఉన్నాయి లేదా అలా ఉన్నట్లు నటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. ప్రత్యేక హోదా అంశంపై రెండు పార్టీలు కొన్ని రోజులు హైడ్రామా నడిపించిన తరువాత రైల్వేమంత్రి సురేష్ ప్రభుకి తెదేపా కోటాలో రాజ్యసభ సీటు కేటాయించడం గమనిస్తే, ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టడానికే ఆవిధంగా వ్యవహరిస్తున్నాయనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రావసరాల దృష్ట్యా కేంద్రంతో సఖ్యతగా ఉండటం చాలా అవసరమే..మంచిదే కానీ ఎటువంటి గడ్డు సమస్యలు ఎదురవుతున్నా అదే విధంగా ఉండగలిగితే ఎవరూ అనుమానించే అవకాశం ఉండదు. కానీ ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రజలలో కొంచెం కదలిక కనబడగానే ప్రజల ‘ఇగో’ని సంతృప్తిపరచడం కోసం తెదేపా నేతలు, మంత్రులు కేంద్రప్రభుత్వంపై కత్తులు దూస్తున్నట్లు నటించడం, అప్పుడప్పుడు పురందేశ్వరి, సోము వీర్రాజు వంటి భాజపా నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుండటం వలననే అనుమానించవలసి వస్తోంది. ఒకవైపు వారు విమర్శలు గుప్పించుకొంటుంటే మరోవైపు వెంకయ్య నాయుడు, స్మృతీ ఇరానీ వంటి వారు చంద్రబాబు నాయుడుని పొగుడుతుంటారు. ఆయన కూడా కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని పొగుడుతూ ఉంటారు.
అంటే ఆ రెండు పార్టీలకి ఒకదానితో మరొకటి ఏవిధంగా వ్యవహరించాలో తెలియకనే వారు ఆవిధంగా మాట్లాడుతున్నారని అనుకోలేము. తెదేపా, దాని అధినేత చంద్రబాబు నాయుడు తీరు, అయన బలాలు, బలహీనతలు అన్నీ కూడా భాజపా అధిష్టానానికి చాలా బాగా తెలుసు. అలాగే రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితి, దాని మనుగడకి తెదేపా సహకారం చాలా అవసరమని తెలుసు. అందుకే అది కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా ఒకే సమయంలో తెదేపాతో రెండు విధాలుగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా తన బలాలు, బలహీనతలు తెలుసు. అందుకే భాజపాతో తెదేపా కూడా అదేవిధంగా వ్యవహరిస్తోంది. ఆ రెండు పార్టీలు చేతులు పట్టుకొని ఒకదానిని ఒకటి నియంత్రించుకొంటూ ముందుకు సాగుతున్నాయి. వాటి స్నేహం వలన వాటికే కాకుండా రాష్ట్రానికి కూడా లబ్ది కలుగుతుంటే ఎవరికీ అభ్యంతఃరం ఉండదు కానీ దాని కోసం రాష్ట్రపయోజనాలు పణంగా పెడతామంటే దానిని ఎవరూ ఆమోదించరు.