అనసూయ ఆనంద విహారి.. ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం అఆకు అర్థం. అయితే ఆ చిత్రం 50+కోట్లు వసూలు చేసినట్టు వచ్చిన అడ్వర్టయిజ్‌మెంట్‌కు ఈ అఆను మరో విధంగా వర్తింపచేస్తున్నారు. అంత రెమ్యూనరేషన్ రావాలంటే ఆ యాడ్ అలానే వుండాలి.అన్నది ఈ కొత్త కాన్సెప్ట్. చిత్రం బాగా ఆడుతున్నా మీడియాలో సోషల్ మీడియాలో అనుకూల సమీక్షలే వచ్చినా వసూళ్లు మాత్రం ఇంకా ఆ స్టేజికి చేరలేదని పరిశ్రమలో అనుభవజ్ఞులు చెబుతున్నారు. హైప్ కోసం మాత్రమే ఇచ్చిన యాడ్ కూడా కాదట. మరెందుకు? రేపు త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ పదికోట్లకు పెరగాలంటే ఇలాటి జిమ్మిక్కులు తప్పవు అని వారు వివరిస్తున్నారు. ఇప్పటికే కళ్లు తిరిగే రెమ్యూనరేషన్లు తీసుకుంటున్న టాప్ దర్శకులు ఇందుకోసం ఇలాటి టెక్నిక్స్ ఎన్నో ఉపయోగించి తమ రేటింగును రేటును కూడా పెంచుకుంటున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఇది ఇలా వుంటే యుద్ధనపూడి సులోచనారాణి మీనా నవలను సినిమాను అనుసరించి తీసిన త్రివిక్రమ్ ఆలస్యంగా ఆ విషయం ఒప్పుకోవడం అనివార్యంగా జరిగింది మాత్రమేననీ, ముందే చెప్పి వుంటే హుందాగా వుండేదని వ్యాఖ్యలు వస్తున్నాయి.పైగా ఈ టైటిల్స్‌లో ఈ విషయం మొదట రాకపోవడానికి సాంకేతిక సమస్యలే కారణమనీ, తర్వాత సరిచేశామని త్రివిక్రమ్ సక్సెస్ మీట్లో చెప్పారు. అయితే చాలా థియేటర్లలో ఇప్పటికీ ఎలాటి సవరణ చేయలేదనీ, ఆమె పేరు లేకుండానే టైటిల్స్ నడుస్తున్నాయని వారు గుర్తుచేస్తున్నారు. అ..ఆ.. ఆహా అనడం తప్ప ఎవరైనా చేయగలిగిందేముంది?