అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయపార్టీకైనా అన్నీ అందుబాటులోనే ఉంటాయి కనుక తలుచుకొంటే ఏమైనా చేయగలదు. కానీ ప్రతిపక్షస్థానంలోకి మారిన తరువాత ఏ కార్యక్రమం చేపట్టాలన్నా నిధులు, పార్టీలో వాటిని సమకూర్చేవారిని చూసుకొని మరీ కార్యరంగంలో దిగవలసి వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకవెలుగు వెలిగిన వారందరూ కష్టకాలంలో ఉన్నప్పుడు మొహాలు చాటేస్తుంటారు కనుక ఇంకా ఇబ్బంది అవుతుంటుంది. అలాగని చేతులు ముడుచుకొని కూర్చొంటే ప్రజలు దానిని మరిచిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక కొంచెం కష్టమైనా అవి తమ ఉనికిని కాపాడుకోవడానికి నిత్యం ఏదో ఒక హడావుడి చేస్తుండాలి…తప్పదు.
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. నిజానికి రాష్ట్ర విభజన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో, కాంగ్రెస్ పార్టీ కూడా అంతే తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పటికైనా కోలుకోవచ్చేమో కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పట్లో కోలుకొనేలా లేదు. అది ప్రత్యేక హోదాని ఆసరా చేసుకొని రాష్ట్రంలో మళ్ళీ లేచి నిలబడాలని విశ్వప్రయత్నాలు చేసింది కానీ ప్రజలు దానిని పట్టించుకోకపోవడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉంది. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికలలో పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్ధులు కూడా దొరకకపోవచ్చు.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా తుడిచిపెట్టుకొనిపోతున్నా కూడా ఆ పార్టీ నేతలు తమ పార్టీని కాపాడుకొనే ప్రయత్నాలు గట్టిగా చేయకుండా తమలో తామే అంతర్గత కుమ్ములాడుకొంటూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా నానాటికీ తీసికట్టుగానే ఉంది. ఇటీవల 4 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో ఘోరపరాజయమే అందుకు చక్కని నిదర్శనం. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకొనే ప్రయత్నం చేయకుండా, రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే సాహసానికి పూనుకొంటోంది. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు వరుస పరాజయాలే తప్ప ఎక్కడా, ఎప్పుడూ ఆయన తన స్వశక్తితో పార్టీకి ఘన విజయం సాధించిన దాఖలాలు లేవు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని ఆయన చేతిలో పెడితే ఇక మోడీ ప్రభుత్వం నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీకి ఏవిధంగాను సమ ఉజ్జీకారని కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. ఒకవేళ రాహుల్ గాంధీ కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా బలహీనపడితే, అప్పుడు ఎన్డీయే కూటమిని ప్రత్యామ్నాయం ఉండదు కనుక జాతీయ స్థాయిలో రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. అప్పుడు ఏ నితీష్ కుమార్ వంటి వాళ్ళో ఆ అవకాశాన్ని వినియోగించుకొని కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమిస్తే ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే కూర్చొని భజన చేసుకోవలసి వస్తుంది.
కనుక కాంగ్రెస్ అధిష్టానం డిల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంపూర్ణ ప్రక్షాళన చేసుకొని వచ్చే ఎన్నికలకి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించడం చాలా మంచిది. జాతీయ స్థాయిలో పార్టీ గురించి ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నారో, రాష్ట్ర స్థాయి పార్టీల గురించి కూడా అంతే గట్టిగా ఆలోచించి అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.