ముద్రగడ పద్మనాభం అరెస్ట్ కి నిరసనగా శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా, శనివారం పశ్చిమ గోదావరి జిల్లా బంద్ కి కాపు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆయనను బేషరతుగా విడుదల చేయకపోతే హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద శనివారం ధర్నా చేస్తామని ఆల్ ఇండియా కాపు జేయేసి నేతలు ప్రకటించారు.
ఈ వ్యవహారం అంతా ఒక పెద్ద గొలుసుకట్టులాగ తయారవుతున్నట్లు కనిపిస్తోంది. తుని విద్వంసానికి కారకులైనవారిని బేషరతుగా విడుదల చేయాలని ముద్రగడ నిరాహార దీక్షకి కూర్చొంటే ఆయన వలన రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుత్తాయనే ఆలోచనతో పోలీసులు ఆయనని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయనని బేషరతుగా విడుదల చేయాలని కాపు సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ ఉభయగోదావరి జిల్లాల బంద్ కి పిలుపునిస్తూ ప్రభుత్వానికి మరో కొత్త సవాలు విసురుతున్నారు.
ఇవ్వాళ్ళ ఉదయం ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొన్నప్పుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపలో మీడియాతో మాట్లాడుతూ, ఉద్యమాల ముసుగులో రాష్ట్రంలో శాంతిభధ్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దానిని ఆచరణలో చూపిస్తూ కొన్ని గంటల వ్యవధిలోనే ముద్రగడని అరెస్ట్ చేశారు. కనుక కాపు సంఘాలతో కూడా ప్రభుత్వం అదేవిధంగా కటినంగా వ్యవహరిస్తుందా లేకపోతే వారి ఓటు బ్యాంక్ ని దృష్టిలో ఉంచుకొని వారి పట్ల మెతక వైఖరి అవలంభిస్తుందా చూడాలి.