సమంత లో ఈమధ్య పరిపక్వత బాగా ఎక్కువైంది. ఏ విషయమైనా పరిణతితో మాట్లాడుతోంది. తప్పొప్పులను బాగానే బేరీజు వేస్తోంది. అందుకనేనేమో ఈమధ్య సమంతకు వరుసగా విజయాలు అందుతున్నాయి. తమిళంలో తెరి సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో 24, అ.ఆ హిట్లు కొట్టేశాయి. ఇప్పుడు సమంత టైమ్ నడుస్తోంది. అయితే.. `నేనిప్పుడే కాస్త జాగ్రత్తగా ఉండాలి` అంటోంది సమంత. ఎందుకంటే విజయం వచ్చిన గర్వంతో తప్పులు చేసే ఛాన్సెక్కువ ఉంటుందని లాజిక్ తీస్తోందీ అమ్మడు.
గతేడాది వరకూ తనకు బ్యాడ్ పిరియడ్ నడిచిన సంగతి గుర్తు చేసుకొంటోంది సమంత. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో అవకాశం వస్తే చాలు.. అనుకొనేదట. ఆ తరవాత హిట్టు కాంబినేషన్ ని చూసి పడిపోయేదట. హీరో కోసమో, దర్శకుడి కోసమో, బ్యానర్ వాల్యూ కోసమో సినిమాలు చేసేదట. దాని వల్లే ఒక దశలో తనకు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయని, అదెంత తప్పో ఇప్పుడు అర్థమైందని చెప్పుకొచ్చింది. కథ నచ్చకపోతే ఎంత పెద్ద హీరో అయినా చేసేది లేదని తెగేసి చెబుతోంది. అంతా బాగానే ఉంది.. మరి బ్రహ్మోత్సవంలో ఏం నచ్చిందని ఆ సినిమా ఒప్పుకొందో?? మహేష్ బాబు పక్కన కనిపిస్తే చాలనుకొందా, అందరికీ వర్తించే సూత్రం మహేష్ దగ్గర పనిచేయదా?