ఇంత కాలానికి కేసీఆర్ సర్కారును సవాల్ చేసి నిలబడే ఓ బలమైన ప్రతిపక్షం తెలంగాణలో రూపుదిద్దుకుంది. తెలంగాణలో ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలనే స్థాయిలో గత రెండేళ్లుగాఫిరాయంపులకు గేట్లు ఎత్తిన తెరాస, ఆ పనిలో చాలా వరకు సఫలమైంది. తెలుగుదేశం శాసనసభా పక్షాన్ని నామమాత్రంగా చేసిపారేసింది. ఆ పార్టీ సభ్యుల బలం 15 నుంచి మూడుకు పడిపోయింది. శాసనసభా పక్ష నాయకుడితో సహా తెరాసలో విలీనం జరిగిపోయింది. కాంగ్రెస్ కు కూడా తెరాస చెక్ పెట్టింది. ఒకరి తర్వాత ఒకరుగా ఎమ్మెల్యేలను ఆకర్షిస్తోంది. ఇటు తెరాస దెబ్బ, అటు అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీన పడుతోంది.
ఐదుగురు ఎమ్మెల్యేలున్న బీజేపీ ప్రతిపక్షమే గానీ పదును లేదు. కేసీఆర్ పై అప్పుడప్పుడు విమర్శల దాడి చేయడమే తప్ప, ఓ బలమైన ప్రతిపక్షం రాష్ట్రంలో ఉందనే అభిప్రాయం కలిగింది లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణలో దూకుడుగా వ్యవహరించలేకపోతోంది. కిషన్ రెడ్డి నాయకత్వంలోనూ ఇప్పుడు లక్ష్మణ్ నాయకత్వంలోనూ జోష్ తో బలోపేతం కావడానికి గట్టి ప్రయత్నం జరగడం లేదు. ప్రతిపక్షం ఉంది జాగ్రత్తగా పనిచేయాలని అధికార పార్టీ అనుకునే స్థాయిలో బీజేపీ ఏనాడూ ప్రవర్తించింది లేదు.
ఇప్పుడు అనూహ్యంగా ఓ బలమైన ప్రతిపక్షం తెరాసకు సవాలు విసురుతోంది. అది రాజకీయ పార్టీ కాదు. కానీ తెరాసకు పక్కలో బళ్లెం లాంటిది. అదే జాయింట్ యాక్షన్ కమిటీ. జె.ఎ.సి. తెరాస రెండేళ్ల పాలన గొప్పగా లేదన్న కోదండరామ్ వ్యాఖ్యలపై తెరాస నేతలు, మంత్రులు, కేసీఆర్ వీరవిధేయులు విరుచుకు పడ్డారు. పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రొఫెసర్ ను తిట్టిపోశారు. ఒకప్పుడు సార్ అంటూ చుట్టూ తిరిగిన వాళ్లే ఇష్టం వచ్చినట్టు తిట్టారు. మరికొందరు మర్యాద ఇస్తూనే చెయ్యాల్సిన విమర్శలు చేశారు.
ఇది జరిగిన తర్వాత కోదండరామ్ కు తెలంగాణ వ్యాప్తంగా మద్దతు పెరిగింది. ప్రతిపక్షాలే కాదు, సామాన్య జనంలో, ముఖ్యంగా యువతలో ఆయనపై సానుభూతి పెల్లుబికింది. వాళ్లందరికీ ఒక్కసారి మిలియన్ మార్చ్ గుర్తుకు వచ్చింది. విమర్శల పర్వం నడుస్తుండగానే జేఏసీ విస్తృత సమావేశం జరిగింది. ప్రజల కోసం వారి తరఫున పోరాడటానికి జేఏసీ కొనసాగుతుందని కోదండరాం తేల్చిచెప్పారు. ఈ కమిటీ మూతపడేది కాదని స్పష్టం చేశారు.
అంతకు ముందు మల్లన్న సాగర్ ముంపు బాధితులకు బాసటగా నిలిచారు. మీరే మాకు దిక్కంటూ చాలా మంది రైతులు కోదండరామ్ ను వేడుకున్నారు. ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. దీన్నిబట్టే, జేఏసీ ఎంత బలమైన ప్రతిపక్షంగా మారుతున్నదో అర్థమవుతుంది. కోదండరామ్ వ్యాఖ్యాల్లోని వాస్తవాలను గుర్తించి, అవాస్తవాలను మాత్రం ప్రస్తావిస్తూ మంత్రులు స్పందించి ఉంటే మరోలా ఉండేది. గంప గుత్తగా ఆయన్ని తిట్టడమే పనిగా పెట్టుకోవడం బెడిసికొట్టింది.
యువత, విద్యావంతులు, వివిధ వర్గాల వారిలో కోదండరామ్ కు ఆదరణ పెరుగుతోంది. ఆయన జనంలోకి వెళ్లి ప్రభుత్వంపై దండయాత్ర చేస్తే మద్దతు బాగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఎదురులేని ఏకపక్ష పాలన చేస్తున్న తెరాస నేతలు, ఏరికోరి ఓ బలమైన ప్రతిపక్షాన్ని తామే తయారు చేశారు. అది ఏకు మేకైతే అధికార పార్టీ వారికి ఇబ్బందులు తప్పవేమో.