తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ లోని సచివాలయంలోని అన్ని బ్లాకులని ఖాళీ చేసి ఇచ్చేస్తామని గవర్నర్ నరసింహన్ కి లేఖ వ్రాసినట్లు తెలుస్తోంది. అంటే ఇంక ఎట్టిపరిస్థితులలోనూ అక్కడ ఏపి ఉద్యోగులు ఉండేందుకు వీలు ఉండదన్నమాట! ఈ వార్తని ప్రభుత్వం ఇంకా దృవీకరించలేదు కానీ దీనిపై సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమని విజయవాడకి తరలించాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం, తమపై ఈవిధంగా ఒత్తిడి తెచ్చి విధిలేని పరిస్థితులలో తరలివచ్చేలా చేయాలని ప్రయత్నిస్తునట్లుందని అనుకొంటున్నారు.
రాష్ట్ర విభజన తరువాత సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్, జె, కె, ఎల్ బ్లాకులు వచ్చాయి. తెలంగాణా ప్రభుత్వానికి సి,డి,బి,ఏ బ్లాకులు వచ్చాయి. వాటిలో కె బ్లాకుని తెలంగాణా ఉద్యోగులు ఖాళీ చేయకపోవడంతో రెండు ప్రభుత్వాలు ఉమ్మడిగా వాడుకొంటున్నాయి.
ఒకవేళ ఏపి ఉద్యోగులు అందరూ విజయవాడకి తరలివచ్చేసినట్లయితే, ఒక్క ఎల్ బ్లాకులో కొంత మంది ముఖ్యమైన సిబ్బందిని మాత్రమే ఉంచి మిగిలిన మూడు బ్లాకులను గవర్నర్ కి అప్పజెప్పేసినట్లయితే వాటి నిర్వహణ భారం భరించనవసరం ఉండదని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడు ఆ ఎల్ బ్లాకుని కూడా స్వాధీనం చేస్తున్నట్లు గవర్నర్ కి లేఖ వ్రాసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగులు తరలింపు ప్రక్రియ ఇంకా మొదలుకాకా మునుపే, జూన్ 27న సచివాలయంలో అన్ని బ్లాకులని ఖాళీ చేసేసి అప్పగించేస్తున్నట్లు ప్రభుత్వం గవర్నర్ కి లేఖ వ్రాసినట్లు వచ్చిన వార్తలతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అది నిజమో కాదో తెలియదు కానీ అది ఉద్యోగులకు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. దీనిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఈయవలసిఉంది. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ని ఈరోజు కలిసి వివరణ కోరే అవకాశం ఉంది.
విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు వద్ద ఐటి, ఎక్సైజ్, పంచాయితీ రాజ్ శాఖల కార్యాలయాలు, తాడేపల్లిలో పోలకంపాడులో అటవీశాఖ, కృష్ణా తీరంలో గల సీతానగరంలో దేవాదాయ శాఖ, విజయవాడ బస్ భవన్ లో ఆర్టీసి కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు చాలా జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేయాలి..ఉద్యోగులు అందరూ ఎప్పటిలోగా తరలిరాగలరు అనే విషయాలపై పూర్తి స్పష్టత రాకుండానే ప్రభుత్వం గవర్నర్ కి లేఖ వ్రాయడం నిజమైతే అది తొందరపాటు చర్యే అవుతుంది. దాని వలన ఊహించని అనేక కొత్త ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు.