తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి రేపు అంటే శనివారం తెరాసలో చేరబోతున్నారని తాజా సమాచారం. ఆయన పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతే మంచిదే అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్నారు కనుక ఆయన తెరాసలో చేరడం ఖాయమనే భావించవచ్చు. అయితే ఆయన ఒక్కరే కాకుండా మరో ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా గులాబీ కారెక్కబోతున్నట్లు తాజా సమాచారం. వారు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపి వివేక్, మాజీ మంత్రి వినోద్.
వారు ముగ్గురూ నిన్నరాత్రి ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం అయినట్లు తెలుస్తోంది. కనుక వారు కూడా త్వరలోనే తెరాసలో చేరిపోవచ్చునని భావించవచ్చు. పార్టీలో ఆధిపత్య పోరు, ఆ కారణంగా అంతర్గత కలహాలు, రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుండటం వంటి కారణాల చేత వారు పార్టీ మారేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు ఆంధ్రా, తెలంగాణా రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది. దానిని ఎదుర్కోవడం ఇతర పార్టీలకి చాలా కష్టమయ్యేది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురేలేదన్నట్లుగా ఉండేది. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి హయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగానే ఉండేది. కానీ రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాలలో దాని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ కారణంగా ఆంధ్రాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, కేవలం టీ-కాంగ్రెస్ నేతల అనైక్యత కారణంగా తెలంగాణాలో అధికారంలోకి రాలేకపోయింది. ఆ తరువాత నుండీ తెరాస ఆకర్ష దెబ్బకి అక్కడ కూడా క్రమంగా తుడిచిపెట్టుకుపోతోంది. ఒకేసారి నలుగురు సీనియర్ నేతలు కాంగ్రెస్ ని విడిచిపెట్టి వెళ్లిపోతే ఆ ప్రభావం పార్టీపై చాలా ఉంటుంది కనుక మిగిలినవారు కూడా వారిని అనుసరించే ప్రమాదం పొంచి ఉంది. ఇటువంటి పరిస్థితిలో కూడా టీ-కాంగ్రెస్ నేతలు పార్టీని కాపాడుకొనే ప్రయత్నాలు చేయకుద్నా వారిలోవారే కీచులాడుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, దాని నేతల తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనబడకుండా మాయం అయిపోయేలా ఉంది.