ఏపిలో తెదేపా, వైకాపాల మద్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెదేపా ప్రభుత్వానికి ఇటీవల 10 ప్రశ్నలు సందించి సమాధానాలు ఇమ్మని కోరారు. పంట రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం వంటి హామీల అమలు గురించి ఆయన ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలకు తెదేపా ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు బదులిస్తూనే ఆయనపై ఎదురుదాడి చేశారు.
రాష్ట్ర విభజన జరగడానికి ప్రధాన కారకుడు బొత్స సత్యనారాయణే అని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికతో రాష్ట్ర విభజన చేయడానికి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయనే ప్రోత్సహించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు అవినీతిలో మునిగితేలిన బొత్స సత్యనారాయణకి 2014 ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. రాష్ట్రానికి ఈ దుస్థితి కల్పించిన ఆయనకి, తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో కూడా రాష్ట్రాభివృద్ధి చేస్తున్న తమని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.
బొత్స అడిగిన ప్రశ్నలకి ఇది సమాధానం కాదు. కానీ ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గురించి ముద్దు కృష్ణ చెప్పిన మాటలు నిజమేనని చెప్పక తప్పదు. ఐదారేళ్ళ క్రితం తెలంగాణా కోసం ఉద్యమాలు జరుగుతున్న సమయంలో, రాష్ట్ర విభజనకి అనుకూలంగా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి బొత్స సత్యనారాయణ మాత్రమే. హిందీ మాట్లాడే ప్రజలకి పది రాష్ట్రాలున్నపుడు, తెలుగు మాట్లాడేవాళ్ళకి రెండు రాష్ట్రలుంటే తప్పేమిటి అని ప్రశ్నించేవారు. అంటే ఆయన రాష్ట్ర విభజన కోరుకొన్నట్లు స్పష్టం అవుతోంది.
రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కారణంగా ఆయన స్థానంలో వేరొకరిని ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నప్పుడు బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మి నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి తదితరులు దానికోసం పోటీ పడినట్లు వార్తలు వచ్చాయి. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన చేస్తున్నప్పటికీ, దానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా బొత్స సత్యనారాయణ తదితరులు ముఖ్యమంత్రి పదవి కోసం డిల్లీలో పైరవీలు చేయడాన్ని ఆంధ్రాలో ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అప్పుడే విజయనగరంలో ఆయన ఆస్తులను ప్రజలు తగులబెట్టారు. ఆ తరువాత వెంటనే జరిగిన ఎన్నికలలో ఆయనతో సహా ఆయన కుటుంబ సభ్యులందరినీ ఓడించి పగ తీర్చుకొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి దుస్థితి కల్పించినందుకు, కాంగ్రెస్ అధిష్టానం ఆయనని పిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో రఘువీరా రెడ్డిని నియమించింది. ఆ అవమానం భరించలేక ఆయన భాజపాలో చేరడానికి సిద్దపడ్డారు. కానీ అది వీలుకాకపోవడంతో వైకాపాలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. ముద్దు కృష్ణమ నాయుడు మళ్ళీ ఆ చరిత్ర పాఠాలను అందరికీ మరోమారు క్లుప్తంగా గుర్తు చేశారు అంతే!