ప్రభుత్వ ఒత్తిళ్ళ కారణంగా ఎన్.టీవి న్యూస్ చానల్ ని వదిలిపెట్టిన ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు సాక్షి మీడియాలో చేరినట్లు ప్రకటించారు. తనకి మళ్ళీ తెరపై కనిపించేందుకు అవకాశం ఇచ్చిన సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. సాక్షి చానల్ లో మళ్ళీ యధాప్రకారం కె.ఎస్.ఆర్. లైవ్ షో నిర్వహించబోతున్నట్లు కొమ్మినేని ప్రకటించారు. రాజకీయాలపై తన అభిప్రాయాలను సున్నితంగా, సునిశితంగా చెప్పే కొమ్మినేని మళ్ళీ ఈవిధంగా ప్రజల ముందుకు రావడం చాలా సంతోషించవలసిన విషయమే. అయితే వైకాపా దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలకు, ఆలోచనలకు, కోర్కెలు, వ్యూహాలకు అనుగుణంగా మాత్రమే నడిచే సాక్షి మీడియాలో ఆయన ఇదివరకులాగ స్వేచ్చగా తన అభిప్రాయాలను వెల్లడించగలరా? వెల్లడిస్తే జగన్మోహన్ రెడ్డి సహిస్తారా? జగన్ అభిప్రాయాలను, కోర్కెలను జనాభిప్రాయంగా చెప్పే సాక్షి మీడియాలో పార్టీలకి అతీతంగా కొమ్మినేని తన లైవ్ షో నిర్వహించగలరా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.