ముద్రగడ పద్మనాభం అరెస్ట్, దాని పర్యవసానాలపై చర్చించి తదుపరి కార్యాచరణ నిర్ణయించేందుకు శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో హ్యాపీ రిసార్ట్స్ లో కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజ అధ్యక్షతన సమావేశం ఏర్పాటుచేశారు. దానికి ప్రభుత్వంలో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలో కాపు నేతలు, కాపు సంఘాల నేతలను ఆహ్వానించారు. కానీ ఆ సమావేశానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట రావు, రామానుజ తప్ప మరెవరూ హాజరుకాలేదని తెలుస్తోంది.
ముద్రగడ అరెస్ట్ కారణంగా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున నిర్వహించబడుతున్న ఆ సమావేశానికి హాజరయితే కాపు సామాజిక వర్గానికి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందనే భయంతోనే ఎవరూ హాజరు కాలేదని సాక్షి మీడియా పేర్కొంది. కానీ తెదేపాలో కాపు మంత్రులు, నేతలు బహిరంగంగానే ముద్రగడ పద్మనాభంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తుని విద్వంసానికి ఆయనే కారకుడని వాదిస్తున్నారు. కనుక ఆయన అరెస్ట్ ని కూడా గట్టిగా సమర్ధిస్తున్నారు. ఆయన వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని గట్టిగా వాదిస్తున్నారు. అటువంటప్పుడు ఈ సమావేశానికి హాజరైనంత మాత్రన్న వారికి కొత్తగా వచ్చే నష్టం ఏముంటుంది? అని ఆలోచిస్తే సాక్షి వాదన అర్ధరహితమని స్పష్టం అవుతుంది. కానీ కాపు కార్పోరేషన్ ఇచ్చే రుణాల మంజూరు కోసం రికమండేషన్ లేఖలు ఇచ్చే కాపు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో? ఇంతకీ ఆ సమావేశంలో పాల్గొన్నవారు ఆ వివరాలనైనా బయటపెడితే బాగుండేది కదా?