నందమూరి బాలకృష్ణ వందో సినిమా అటు తిరిగి, ఇటు తిరిగి క్రిష్ దగ్గరకు చేరింది. హార్డ్ కోర్ బాలయ్య ఫ్యాన్స్‌కు క్రిష్ విషయం మింగుడు పడలేదు. మన బాలయ్యను ఎలా చూపిస్తాడో అని కంగారు పడ్డారు. గౌతమి పుత్ర శాతకర్ణి అన్న టైటిల్ బయటకు రాగానే ఇంకాస్త కంగారు మొదలైంది. మన బాలయ్య మాస్ హీరో కాదు, కొంపదీసి మన క్రిష్ ఎప్పట్లానే క్లాస్ మూవీ తీసేస్తాడేమో అని భయపడ్డారు. కానీ.. గౌతమి పుత్ర ప్రీ లుక్ బయటకు వచ్చింది.. ఆ స్టిల్ చూడగానే బాలయ్య అభిమానులకూ దిమ్మతిరిగిపోయింది. యుద్ద వీరుడిగా బాలయ్య గెటప్ చూసి ఔరా అంటున్నారు. ఈ ఒక్క లుక్ తోనే క్రిష్ తన ఉద్దేశ్యాన్ని చెప్పకనేచెప్పేశాడు. బాలయ్య అభిమానులకు పండగలాంటి సినిమా ఇస్తున్నానని ఒక్క స్టిల్‌తోనే ప్రకటించేశాడు.
క్రిష్ గట్స్‌ని మెచ్చుకొని తీరాలి. సినిమా ఎనౌన్స్ చేసిన నెల రోజులకే సెట్స్‌పైకి తీసుకెళ్లిపోయాడు. ఆల్రెడీ రెండు వార్ ఎపిసోడ్స్ కూడా తీసేశాడు. అదే రాజమౌళి అయితేనే.. పబ్లిసిటీతోనే యేడాది టైమ్ పాస్ చేసేవాడు… అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అది సహజం కూడా. ఎందుకంటే బాహుబలి విషయంలో .. రాజమౌళి ఎంత ఆలస్యం చేశాడో అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమా అలా మొదలైందో, లేదో కీలకమైన రెండు యుద్ద ఘట్టాలు తీసి, పస్ట్ లుక్ కూడా బయటకు వదిలేశాడు. ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాని టక టక లాగించేస్తున్నాడు. ధైర్యం చేసి రిలీజ్ డేట్ కూడా ముందే చెప్పేశాడు. క్రిష్ స్పీడు చూస్తుంటే ముచ్చటేస్తోంది. బాలయ్య వందో సినిమా ఓ మైలు రాయి అవ్వబోతోందన్న సంకేతాన్ని క్రిష్ పంపించేశాడు. నందమూరి అభిమానులు ఎదురు చూసేదీ అందుకోసమే. ఆల్ ద బెస్ట్.,, క్రిష్!