రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయవలసిన సమయంలో కులాల కుమ్ములాటలని చూస్తుంటే చాలా బాధ కలుగకమానదు. ఆ పోరాటాల వలన సదరు కులస్తులకైనా ఏమైనా లాభం చేకూరినా సంతోషించవచ్చు కానీ ఎవరూ ప్రయోజనం పొందడం లేదు. అధికార, ప్రతిపక్షాలు కులాల పేరిట రాజకీయ చదరంగం ఆడుకొంటుంటే, మద్యలో అమాయకులైన ప్రజలు సతమతమవుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రాష్ట్రంలో కులాల మద్య చిచ్చుపెట్టారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కులాల మద్య కాదు ఒకే కులస్థుల మద్య కూడా చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభాన్ని నిలువరించే ప్రయత్నంలో ఆయన కాపు కులస్థుల మద్య చిచ్చు పెడుతున్నారని జగన్ ఆరోపించారు.
తెదేపా నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిపై అదే ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ముద్రగడ పద్మనాభం, మంద కృష్ణ మాదిగని అడ్డుపెట్టుకొని కులరాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి చిన రాజప్ప ఆరోపించారు.
రాష్ట్ర విభజన తరువాత కొన్ని రోజులు ప్రత్యేక హోదా గురించి అలజడి, మళ్ళీ ఇప్పుడు ఈ అలజడి రాష్ట్రాన్ని కుదిపివేస్తోంది. ముద్రగడ జగన్ చేతిలో కీలుబొమ్మగా మారి ఆయన అడమన్నట్లు ఆడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని చిన రాజప్ప ఆరోపించారు.
కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం ఉద్యమించినప్పటి నుంచే రాష్ట్రంలో అశాంత వాతావరణం ఏర్పడిందని అందరికీ తెలుసు. ఆయితే ఈ సమస్యకు మూలకారణం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కాపులకి రిజర్వేషన్లు కల్పిస్తానని, వారి సంక్షేమం కోసం ఏటా రూ.1000 కోట్లు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చి దానిని నిలబెట్టుకోక పోవడమే కారణం అనే ముద్రగడ పద్మనాభం వాదనని తప్పు పట్టలేము. ఈ అశాంతికి ఎవరు కారకులైనప్పటికీ, ఇరువర్గాలు విజ్ఞత ప్రదర్శిస్తూ దానిని సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నాలు చేయకపోగా, దానిలోకి రాజకీయాలు కూడా జొప్పించే ప్రయత్నాలు చేయడం వలననే ఈ సమస్య ఇంత జటిలమైందని చెప్పక తప్పదు. అయినా కూడా దీనిపై ఎవరూ రాజకీయాలు చేయడం మానుకోకపోవడం ప్రజల దూరదృష్టంమే. రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన సమస్యలు సరిపోవన్నట్లుగా ఇటువంటి సమస్యలను కూడా సృష్టించుకొంటే ఇంక రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించడానికి సమయం ఎక్కడ మిగులుతుంది? రాష్ట్రంలో ఇటువంటి అశాంత, అరాచక వాతావరణం నెలకొని ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఏవిధంగా వస్తాయి? అందరూ ఆలోచించవలసిన సమయం ఇది.