హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపి ప్రభుత్వోద్యోగులు కోరినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం వారికి 30శాతం ఇంటి అద్దె అలవెన్సుని పెంచింది. వారానికి 5రోజుల పనికి ఒప్పుకొంది. ఉద్యోగుల స్థానికతకి సంబంధించిన ఫైల్ పై ఇవ్వాళ్ళే రాష్ట్రపతి సంతకం చేయడంతో ఆ సమస్య కూడా పరిష్కారం అయింది. కనుక ఉద్యోగులు ఇంకా అభ్యంతరాలు చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ విజయవాడ తరలిరావలసిన సమయం దగ్గర పడుతున్నకొద్దీ వారిలో ఆందోళన పెరిగిపోతోంది. ఇవ్వాళ్ళ సచివాలయ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి విజయవాడ తరలిరావడానికి తమకు మరొక ఆరు నెలలు గడువు కావాలని కోరినప్పుడు ఆయన వారిపై చాలా కోపగించుకొన్నారు.
“మీరు అడిగినవాటికి అన్నిటికీ నేను అంగీకరిస్తున్నప్పటికీ మీరు ఇంకా సమయం కావాలని అడగడం ఏమిటి? అయినా సమస్యలుంటే నాతో చెప్పుకోవాలి గానీ మీరు వెళ్లి భాజపా నేత పురందేశ్వరిని కలవడం ఏమిటి? మీ సమస్యలను నేను పరిష్కరిస్తానా లేక ఆమె పరిష్కరిస్తారా? అందరూ తప్పనిసరిగా జూన్ 27లోగా విజయవాడ తరలిరావలసిందే. ఇంక కొత్తగా ఎటువంటి గడువులు ఇచ్చేది లేదు,” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఇక చేసేదేమీ లేక ఉద్యోగులు అందరూ అందుకు అంగీకరించి బయటకు వచ్చేశారు.
అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ “ఈ నెల 27న మేమందరం విజయవాడ తరలివెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఆలోగా తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తవుతుందని ఆశిస్తున్నాము,” అని క్లుప్తంగా చెప్పారు.
ఆలోగా తాత్కాలిక సచివాలయం సిద్దం అయినప్పటికీ, సంబంధిత శాఖల ఫైళ్ళు, కంప్యూటర్లు అన్నీ అక్కడికి తరలివచ్చినప్పుడే ఉద్యోగులు పనిచేయడానికి వీలుపడుతుంది. లేకుంటే వారు వచ్చినా ఎటువంటి ప్రయోజనం ఉండదని రాష్ట్ర ఎన్.జి.ఓ. సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. ఆ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిసే ఉంటుంది. కనుక ఉద్యోగుల కంటే ముందుగా లేదా వారితో బాటు సంబంధిత శాఖల ఫైళ్ళను కూడా తాత్కాలిక సచివాలయానికి తరలించడం సాధ్యమా కాదా అని ఆలోచించడం మంచిది. అలాగే జూన్ 27లోగా తాత్కాలిక సచివాలయం సిద్దం అయ్యే అవకాశం లేనట్లయితే, ఉద్యోగులు కోరినట్లుగా వారికి మరికొంత సమయం ఇస్తే వారు కూడా సంతోషిస్తారు. ఈలోగా పరిపాలనా సబంధమైన పనులు కూడా ఆటంకం లేకుండా సాగుతుంటాయి. అలాగ కాక పంతానికి పోయి ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా ఉద్యోగులను విజయవాడ తరలిస్తే వారికీ, ప్రభుత్వానికి కూడా ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుంది.