తునిలో కాపు గర్జన సభ అనంతరం జరిగిన విద్వంసానికి వైకాపాయే కారణమని ఇంతవరకు ఏపి ప్రభుత్వం, తెదేపా నేతలు ఆరోపిస్తుండటం, వారి ఆరోపణలని వైకాపా నేతలు ఖండిస్తుండటం జరిగేది. కానీ ఇప్పుడు వైకాపా కూడా దానికి తెదేపాయే కారణమని ఎదురుదాడి చేయడం మొదలుపెట్టింది. అంతే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ కుట్రకి సూత్రధారి అని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న ఆరోపించి, సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వానికి, తెదేపా నేతలకి ఊహించని, జీర్ణించుకోలేని సవాలే! ఎందుకంటే, తుని ఘటనలకి జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు అని వాళ్ళు ఆరోపిస్తున్నపుడు, అతనే సిబిఐ విచారణ జరిపించమని డిమాండ్ చేస్తున్నందున, ప్రభుత్వం దానిని నిరాకరిస్తే ముఖ్యమంత్రిపై జగన్ చేస్తున్న ఆరోపణలను అంగీకరించినట్లవుతుంది.
తుని విద్వంసంపై సిబిఐతో విచారణ జరిపించకుండా సిఐడి పోలీసులతో ఎందుకు విచారణ జరిపిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రశ్నించారు. సిబిఐ విచారణకి నేను సిద్దం. ముఖ్యమంత్రి కూడా సిద్దమేనా? అని ప్రశ్నించారు. తక్షణమే ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని, వాళ్ళే ఎవరు దోషులో తేల్చుతారని జగన్ డిమాండ్ చేశారు. జగన్ బంతిని ముఖ్యమంత్రి కోర్టులో పడేసి చేతులు దులుపుకోగానే, అంబటి రాంబాబు వంటి వైకాపా నేతలు కూడా ఆయనకి కోరస్ పాడుతూ సిబిఐ విచారణకి డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై ప్రభుత్వం తరపున స్పందించిన హోం మంత్రి చినరాజప్ప బంతిని ముద్రగడ పద్మనాభం కోర్టులో పడేసి చేతులు దులుపుకొన్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ముద్రగడ పద్మనాభం తన దీక్షని విరమించి ఆయన కూడా అంగీకరిస్తే తుని విద్వంసంపై సిబిఐ విచారణ జరిపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము,” అని ప్రకటించారు.
ఈ కేసుపై ఎవరి చేత విచారణ చేయించాలో నిర్ణయం తీసుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండగా ఈకేసులో ఒక నిందితుడిగా ఉన్న ముద్రగడ అంగీకరిస్తే, ఆయన తన దీక్ష విరమిస్తే సిబిఐ విచారణకి ఆదేశిస్తామని హోం మంత్రి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అదే ప్రశ్న విలేఖరులు అడిగినప్పుడు దానికి ఆయన చాలా విచిత్రమైన సమాధానం చెప్పారు.
“ముద్రగడ ఆత్మహత్య చేసుకొంటానని బెదిరిస్తున్నారు కనుక ఆయనని రక్షించుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఆయన వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మేము నమ్ముతున్నాము. మేము ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించాలని ప్రయత్నిస్తుంటే జగన్ దానిని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కనుక ముద్రగడ తన దీక్షని విరమించి సిబిఐ విచారణకి అంగీకరిస్తే, అప్పుడు వారిద్దరి మద్య ఎటువంటి రహస్య అవగాహన ఉందో బయటపడుతుంది,” అని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, తెదేపా నేతలు అందరూ వారిద్దరే తుని విద్వంసానికి మూల కారకులని ఆరోపిస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి స్వయంగా సిబిఐ విచారణ జరిపించమని డిమాండ్ చేస్తున్నప్పుడు, వారిరువురినీ దోషులుగా నిరూపించేందుకు దానిని ఒక మంచి అవకాశంగా భావించి తక్షణమే సిబిఐ విచారణకి ఆదేశించకుండా ఈవిధంగా మాట్లాడటం చేత, జగన్ తన ఆరోపణలు నిజమని గట్టిగా వాదించే అవకాశం కల్పిస్తోంది. పైగా ముద్రగడ ఆత్మహత్య చేసుకొంటానని బెదిరిస్తుంటే, దానిని మరో నేరంగా భావించి కేసు నమోదు చేస్తామని హెచ్చరించవలసిన హోం మంత్రి, ఈవిధంగా చెప్పడం చాలా విస్మయం కలిగిస్తుంది.
సాక్షాత్ హోం మంత్రి ఈవిధంగాచెప్పడంతో ఇంతవరకు వారిరువురిపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న తెదేపా ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లవుతుంది కదా! తుని విద్వంసంలో తన వాళ్ళు ఎవరికీ సంబంధం లేదని ముద్రగడ వాదిస్తున్నారు. కానీ ఆ కేసులో అరెస్ట్ అయినవాళ్ళు తనవాళ్ళేనని వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన వాదన కూడా చాలా విచిత్రంగానే ఉంది. బహుశః అందుకే హోం మంత్రి బంతిని ఆయన కోర్టులో పడేసి చేతులు దులుపుకొన్నారేమో? ఒకవేళ ఆయన సిబిఐ దర్యాప్తుకి అంగీకరించకపోతే వారే ఈ కుట్రకి పాల్పడ్డారనే ప్రభుత్వ వాదనకి బలం చేకూరుతుంది. ఇదంతా చూస్తుంటే కాపులకి రిజర్వేషన్ల కోసం మొదలైన పోరాటం చివరికి ఎక్కడికో వెళ్లిపోతున్నట్లుంది.