వచ్చే ఏడాది పంజాబ్, ఉత్తరప్రదేశ్ శాసనసభల ఎన్నికలు జరుగనున్నాయి. వాటి కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయి. డిల్లీకే పరిమితమైన ఆమాద్మీ పార్టీ పంజాబ్ కి కూడా పార్టీని విస్తరించే ప్రయత్నంలో ఆరేడు నెలల క్రితం నుంచే ఆ రాష్ట్రంపై దృష్టి పెట్టి పనిచేయడం మొదలుపెట్టింది. ఆ రాష్ట్రంలో ప్రధాన సమస్య మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యాపారం అని మొదట గుర్తించినది ఆమద్మీ పార్టీయే. అందుకే తమ పార్టీ అధికారంలోకి వస్తే వాటిని అరికడతామని ఆ పార్టీ హామీ ఇస్తోంది.
ఇటీవల ‘ఉడ్తా పంజాబ్’ అనే సినిమా వచ్చింది. దానిపై ప్రస్తుతం చాలా వివాదం ఏర్పడింది. అది వేరే సంగతి. పంజాబ్ ని చిరకాలంగా పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల సమస్యలని ఆ సినిమాలో చూపించారు. అంటే ఆ సమస్య తీవ్రత ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ సమస్యపై పోరాటంలో ఆమాద్మీ పార్టీ తమ కంటే ముందున్నట్లు గుర్తించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, దానిపై సమరశంఖం పూరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ మాదకద్రవ్యాల సమస్య, ఆ కారణంగా రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను నిరసిస్తూ ఆయన ఈ నెల 13న జలంధర్ లో ఒక్కరోజు ధర్నా చేయబోతున్నారు.
నిజానికి పంజాబ్ లో ఈ సమస్య చాలా దశాబ్దాలుగా నెలకొని ఉంది. కానీ దానిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నడూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ కారణంగానే అది నేడు ఒక మహాసామ్రాజ్యంలాగ విస్తరించిపోయి, బలమైన పంజాబ్ సామాజిక వ్యవస్థని చెదపురుగులా దొలిచేస్తూ బలహీనపరుస్తోంది.
ఆ సమస్యని గుర్తించిన ఆమాద్మీ దాని నివారణకి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందో లేదో తెలియదు కానీ దానిని రాబోయే ఎన్నికలలో ప్రధానాస్త్రంగా వాడుకోవచ్చని గ్రహించింది. దానితో ఆమాద్మీ ఎక్కడ లాభపడిపోతుందోననే ఆలోచనతో రాహుల్ గాంధీ కూడా ధర్నాకి సిద్దం అయిపోతున్నారు. ఉడ్తా పంజాబ్ సినిమాతో ఆ సమస్య ఇంకా హైలైట్ అయ్యింది కనుక బహుశః భాజపాతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక దానిపై పోటాపోటీగా ఉద్యమించడం మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు. సమాజానికి హాని కలిగిస్తున్న ఒక తీవ్రమైన సమస్య పరిష్కారం కోసం నిజాయితీగా కృషి చేయవలసిన రాజకీయ పార్టీలు, దానిని తమ రాజకీయ లబ్ధికి పనికివచ్చే అస్త్రంగా మాత్రమే చూడటం చాలా శోచనీయం.