భావాత్మక చిత్రాల దర్శకుడిగా క్రిష్ కి పేరుంది. గమ్యంతోనే ఆయనేంటో తెలుగు చిత్రసీమకు తెలిసొచ్చింది. కృష్ణం వందే జగద్గురుం, వేదం, కంచె చిత్రాలతో తనదంటూ ఓ మార్క్ వేయగలిగారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ఱికి కూడా ఆయనే దర్శకుడు. కెరీర్లో కీలకమైన స్టేజ్లో ఉన్న క్రిష్.. ఇప్పుడు జీవితంలోనూ ఓ అడుగుముందుకు వేస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఖమ్మంకు చెందిన రమ్యతో ఆయన తన జీవితాన్ని పంచుకోబోతున్నారు.
రమ్య ఓ డాక్టర్. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహమే. నెలన్నర క్రితం నుంచే ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు మొదలయ్యాయి. ఇప్పుడు క్రిష్ – రమ్యలు ఓకే చెప్పుకోవడంతో పెళ్లికి రెడీ అయిపోయారు. త్వరలో నిశ్చితార్థం జరిగి, ఆగస్టులో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకొన్నాయి. ఆగస్టులో పెళ్లి డేట్ ఎప్పుడన్నది ఫిక్స్ చేయాల్సివుంది.