తుని విద్వంసానికి పాల్పడినట్లు అనుమానిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన 7మందిని బేషరతుగా విడుదల చేయాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం, ఆయన భార్య ఇద్దరూ కూడా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో తమ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించడానికి, వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఇద్దరూ నిరాకరిస్తున్నారు. వారు కిర్లంపూడిలో దీక్ష మొదలుపెట్టినప్పుడు, చాలా దూకుడుగా వ్యవహరించి అరెస్ట్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు వారి విషయంలో కొంచెం వెనక్కి తగ్గినట్లుంది. ఆయన దీక్ష విరమిస్తే జగన్ కోరినట్లుగా సిబిఐ దర్యాప్తుకి ఆదేశిస్తామని బేరం పెట్టడమే అందుకు నిదర్శనం. ఉభయగోదావరి జిల్లాలలో కాపుల ఆగ్రహాన్ని చూసి ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుంది.
అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేసేవరకు దీక్ష కొనసాగిస్తామని ముద్రగడ, కోర్టు పరిధిలో ఉన్న ఆ నేరస్తులను విడుదల చేయబోమని ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పడంతో ఇరు వర్గాలు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళలేని పరిస్థితులు స్వయంగా కల్పించుకొన్నట్లయింది. అటువంటి ప్రకటన చేసిన తరువాత ముద్రగడ దీక్ష విరమిస్తే నవ్వులపాలవుతారు. ఆయన చేత దీక్ష విరమింపజేయడం కోసం అరెస్ట్ చేసిన ఏడు మందిని విడుదల చేస్తే ప్రభుత్వానికి అప్రదిష్ట. కనుక ఆయన చేత బలవంతంగా దీక్ష విరమింపజేయడం ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తోంది. కాకినాడ నుంచి వచ్చిన వైద్య నిపుణులు సూచనల మేరకు నేడోరేపో ముద్రగడ దంపతుల దీక్షని బలవంతంగా విరమింపజేసే అవకాశం ఉంది.
కానీ అంతటితో ఈ సమస్య పరిష్కారం కాదని అందరికీ తెలుసు. ఇంతవరకు ప్రభుత్వం సరిగ్గానే వ్యవహరించిందని చెప్పవచ్చు. కానీ ఆయనని న్యాయస్థానంలో ప్రవేశపెట్టి ఉండి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసిన అవసరం ఉండేది కాదు. అప్పుడు న్యాయస్థానాలే ఈ సమస్యని తమదైన శైలిలో పరిష్కరించేవి. అరెస్ట్ అయిన ఏడుగురు వ్యక్తులు నిర్దోషులని వాదిస్తున్న ముద్రగడ పద్మనాభం దానిని కోర్టులో నిరూపించుకోవలసివచ్చేది. కానీ ఆయనని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ పై జైలుకి తరలిస్తే అది కాపులను ఇంకా రెచ్చగొట్టినట్లవుతుందనే భయంతోనే ప్రభుత్వం సంకోచిస్తునట్లుంది.
ఆయనని కిర్లంపూడి నుంచి అరెస్ట్ చేసి తీసుకువచ్చి రెండు రోజులైన తరువాత కూడా ఇంతవరకు న్యాయస్థానంలో ప్రవేశపెట్టకపోవడం చేత, రేపు ఏదైనా ఊహించని సమస్య తలెత్తితే అప్పుడు న్యాయస్థానం కూడా ముద్రగడ దంపతులని తమ ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించవచ్చు. అదే జరిగితే ఆయన విషయంలో ప్రభుత్వం తప్పటడుగు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
కాపులకి రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలుపెట్టిన ముద్రగడ పద్మనాభం, తెలిసో తెలియకో వేరే అంశంపై పోరాటం మొదలుపెట్టి స్వయంగా ఇబ్బందికర పరిస్థితులలో ఇరుక్కుపోవడమే కాకుండా, కాపులకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. వారు పూర్తిగా ఆయనని వెనకేసుకు రాలేకపోతున్నారు. అలాగని పూర్తిగా విడిచిపెట్టేయలేకపోతున్నారు. ఆయన వలన ప్రజలు, ప్రభుత్వం వందలాదిమంది పోలీసులు అందరూ ఇబ్బందిపడుతున్నారు. మరి ఈ సమస్యకి ముగింపు ఎప్పుడు ఏవిధంగా ఉంటుందో చూడాలి.