తెలంగాణలో తెరాస ఆపరేషన్ ఆకర్ష్ జోరు తగ్గడం లేదు. కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బకొట్టడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెరాసలో చేరుతారని ఇటీవల వార్తలు వచ్చాయి. రేపో మాపో వాళ్లిద్దరూ కారెక్కడం ఖాయమని ఊహాగానాలు జోరుగా వినవచ్చాయి. ఇంత వరకూ వారు పార్టీ ఫిరాయించలేదు. అయితే ఆ వార్తలు అబద్ధం కాదని వారి అనుచరులు చెప్తున్నారు.
ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి పదవి ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఎంతో కాలంగా ఎంపీగా ఢిల్లీలో ఉన్నా మంత్రిగా అధికార హోదా అనుభవించాలనే కోరిక తీరలేదు. తెరాసలోకి వస్తే రాష్ట్ర మంత్రిగా ఆ ముచ్చట తీరుతుందనే ఆఫర్ వచ్చినట్టు సమాచారం. దీంతో ఆయన కారెక్కడానికి మానసికంగా సిద్ధమయ్యారని అంటున్నారు.
శుక్రవారం హైదరాబాదులో సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి తదితరులు గుత్తాతో భేటీ అయ్యారు. కష్టకాలంలో పార్టీని వదిలివెళ్ల వద్దని బుజ్జగించారు. అయితే, మంత్రి కావాలనే తన కోరిక తీరడానికి మంచి ఆఫర్ వచ్చిందని చెప్పారట. అంటే ఆ ఆఫర్ ను తిరస్కరిస్తున్నట్టు మాత్రం చెప్పలేదని సమాచారం. దీన్నిబట్టి ఆయన తెరాసలోకి వెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆయన్ని ఎం ఎల్ సి ని చేసి మంత్రి పదవి ఇస్తే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అప్పుడు కాంగ్రెస్ నుంచి జైపాల్ రెడ్డి పోటీ చేయాలని కూడా అప్పుడే నేతలు సూచిస్తున్నారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా కారెక్కడానికి రెడీ అయ్యారని అంటున్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆయన జవాబు ఇవ్వలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ధోరణితో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీన్ని బట్టి అధికార పార్టీలో చేరడం ఖాయమనే ఊహాగానాలు వినవస్తున్నాయి.
ఇప్పటికే కేసీఆర్ మంత్రివర్గంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంచి వాటానే దక్కింది. టీడీపీ గుర్తుపై గెలిచిన తలసాని మంత్రి అయ్యారు. టీడీపీ నుంచి ఏరికోరి ఆహ్వానించిన తుమ్మల మంత్రిగా కొనసాగుతున్నారు.
టీడీపీ నుంచి వచ్చిన కడియం శ్రీహరి ఉపముఖ్యమంత్రి అయ్యారు. మరో టీడీపీ మాజీ నేత పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రివర్గంలో చేరారు. మరో మంత్రి మహేందర్ రెడ్డి కూడా తెలుగు దేశం నుంచే వచ్చారు.
అసలు సిసలైన ఉద్యమకారులు, తెరాస నేతలకు బదులు కొత్తగా పార్టీలో చేరి మంత్రి పదవి పొందే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పద్నాలుగేళ్లుగా పార్టీ జెండా మోసిన తమకు ఘోరమైన అన్యాయం జరుగుతోందని చాలా ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కుమిలిపోతున్నారు. అయినా పైకి ఏమీ అనలేక పోతున్నారు. అనుచరులు, మీడియా ప్రతినిధుల దగ్గర ఆఫ్ ది రికార్డుగా గోడు వెళ్లబోసుకోవడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు.