తుని విద్వంసంపై అధికార, ప్రతిపక్షాలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. దానికి సూత్రధారి జగన్మోహన్ రెడ్డేనని తెదేపా నేతలు ఆరోపిస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సూత్రధారి అని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దానికి ఎవరు బాధ్యులో తేలాలంటే సిబిఐ విచారణకి ఆదేశించడం ఒక్కటే మార్గమని జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం అంగీకరిస్తే దానికి తాము కూడా సిద్దమేనని హోం మంత్రి చినరాజప్ప చెప్పారు.
తాజా సమాచారం ప్రకారం ఈ కేసుపై సిబిఐ విచారణ అవసరం లేదని, సిఐడి పోలీసుల దర్యాప్తు సరిపోతుందని ముద్రగడ పద్మనాభం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దానిని ఆయన కానీ ఆయన తరపున మరెవరూ గానీ దృవీకరించలేదు. ఒకవేళ ఆయన సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పడం నిజమైతే, జగన్ తో సహా అందరూ దాని కోసం పట్టుబడుతుంటే ఆయన ఒక్కరే ఎందుకు వద్దంటున్నారో వివరించవలసి ఉంటుంది. జగన్, ముద్రగడ తలోమాట చెప్పినట్లయితే దానిని తెదేపా ఒక అవకాశంగా మలుచుకొని విమర్శలు గుప్పించడం తద్యం. ఒకవేళ ఆయన కూడా సిబిఐ విచారణకి అంగీకరించినట్లయితే, దోషులెవరైనా అందరికీ ఇబ్బందులు తప్పవు. కానీ పరిస్థితి అంత వరకు వెళ్ళకపోవచ్చు. సిఐడి విచారణ పేరిట కొన్ని రోజులు హడావుడి చేసిన తరువాత, ఓటుకి నోటు కేసులాగే దీనిని పక్కన పడేయవచ్చు.