తెలంగాణలో పాలకపక్షం టిఆర్ఎస్ తెలుగుదేశం పార్టీని దాదాపు ముగించిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ నుంచి వెళ్లినా… ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు మాత్రం ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణ ‘ఇచ్చిన’ పార్టీగా అధికారంలోకి రాలేకపోయామన్న దిగులు తీరకముందే . అసలు ఉనికి ే కోల్పోతే ఎలా అని జాతీయ నేతలు కూడా తలకిందులవుతున్నారని సమాచారం. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానించడం యధార్థం.సుఖేందర్‌రెడ్డి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పుడే కెసిఆర్ చాలా సానుకూలంగా మాట్లాడారు. అప్పుడే ఆహ్వానించారు కూడా . తెలుగుదేశంలో వుండగానే తనతో తెలంగాణ గురించి సుఖేందర్ చర్చించేవారని ఒక సందర్భంలో కెసిఆర్ చెప్పారు. జైపాల్‌రెడ్డి మేనల్లుడైన సుఖేందర్‌రెడ్డి గత మూడుసార్లుగా గెలుస్తూ హ్యాట్రిక్ విజేత అయ్యాడు. ఇప్పుడాయన రాజీనామా చేసి రాష్ట్ర మంత్రి కావాలని కోరుకుంటున్నారు. అయినా టిఆర్ఎస్ ప్రస్తుతానికి ఎంపీగానే కొనసాగించవచ్చు. తెలుగుదేశం, వైసీపీ ఎంపిల ఫిరాయింపు జరిగిపోయింది గాని ఇప్పుడు కాంగ్రెస్‌నుంచే తీసుకుంటే లోక్‌సభలో ఏమైనా ప్రస్తావనలు ప్రతిస్పందనలు వస్తాయా అన్నది చూడాల్సిందే. కాంగ్రెస్‌లో వున్నప్పుడు కూడా కొంత స్వంత గొంతు వినిపించే అలవాటు వున్న సుఖేందర్ వాటర్‌గ్రిడ్ రుణానికి సంబంధించి ప్రతికూలంగా రాసిన లేఖ చాలా దుమారం రేపింది. అయినా సర్దుకుని తీసుకోవడమంటే నల్గొండ జిల్లాలో టిఆర్ఎస్ను బలోపేతం చేసుకోవాలన్న అవసరమే కారణం. జిల్లా పునర్విభజనను కూడా గమనంలో పెట్టుకుని అంచనాలు వేస్తున్నారు. కాంగ్రెస్ ఇంకా బలంగా వున్న జిల్లా పరస్పర తగాదాలు ఎక్కువగా వున్న జిల్లా కూడా నల్గొండనే కావడం విశేషం. ఇటీవలనే వయోవృద్ద ఎంపి పాల్వాయి గోవర్ధనరెడ్డి వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా వున్నాయి.పార్టీమార్పుపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనపై ఊహాగానాలను ఖండించిన అదే తుదిమాట అని చెప్పడానికి లేదు.
మాజీ ఎంపీ, తెలంగాణలో పెద్ద పారిశ్రామికవేత్త వివేక్ పార్టీ మార్పు వార్త కూడా ముఖ్యమైందే. ఆయన సోదరుడు వినోద్ కూడా ఈ వరుసలోనే ఉన్నారు. గతంలో వివేక్ టిఆర్ఎస్లో చేరి బయటికి వచ్చారు. అప్పుడాయన పేరు ‘దళిత ముఖ్యమంత్రి’ పరిశీలనలో వినిపిస్తుండేది. ఆ అవకాశం లేదని తేలాకే మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. తెలంగాణలో జయప్రదంగా నడుస్తున్న ఛానల్ వి6 అధినేత అయిన వివేక్ మళ్లీ పాలకపక్షంలో చేరితే ఆ ప్రభావం అనేక రూపాల్లో ఉండొచ్చు. అసలు ఇంతమంది ఉద్దండులు వచ్చేస్తుంటే మా పరిస్థితి ఏమిటని ‘ఒరిజినల్’ టిఆర్ఎస్ నేతలు దిగులు పడుతున్న మాటా నిజమే. మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి తనకు సంబంధించిన కథనాలను ఖండించారు కానీ అదే అంతిమమా?
. ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పే పునరేకీకరణ ను నేను ‘ఏకైకీకరణ’ అని వర్ణిస్తుంటాను. టిఆర్ఎస్ తప్ప మరో బలమైన పార్టీ ఇక్కడ వుండకూడదని ఆయన కోరుకుంటున్నారు గనక ఈ చేరికలు ఆగేవి కావు.చేరేవారూ ఆగరు. ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా చాలా అసంతృప్తిగా వున్నా అనివార్యంగా సర్దుకుపోతున్నారని సన్నిహితుల కథనం. పిసిసి అద్యక్షుణ్ని మార్చాలన్నది మరో గట్టి ఒత్తిడి. ఇన్నిటి మధ్యనా కాంగ్రెస్ కథ ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.