ఈ సమ్మర్లో బిగ్గెస్ హిట్గా నిలిచే క్రమంలో ముందడుగు వేసుకొంటూ వెళ్తోంది… అ.ఆ. ఓవర్సీస్లో ఈ చిత్రానికి ఇప్పటికీ బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. బీ,సీలలో కాస్త డల్ అవుతుందేమో అనుకొంటే, అక్కడా అదే జోరు. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ తీసుకొన్న ముందు జాగ్రత్త చర్యలు బాగా వర్కవుట్ అయినట్టు కనిపిస్తున్నాయి. పెద్ద సినిమాల హడావుడి తగ్గిన తరవాత అఆ ని విడుదల చేయడం, దానికి తోడు హైప్ మరీ ఎక్కువ కాకుండా చూసుకోవడం బాగా కలిసొచ్చాయి. అంతే కాదు… ఈ సినిమాని ఆక్షరి క్షణాల్లో ట్రిమ్ చేశాడట త్రివిక్రమ్. దాదాపుగా 18 నిమిషాల సినిమాని సెన్సార్ అయిన తరవాత తొలగించారని టాక్. ఆఖరి క్షణాల్లో త్రివిక్రమ్ సినిమా చూసుకొని.. ఎందుకైనా మంచిదని అప్పటికప్పుడు ట్రిమ్మింగ్ చేశాడట.
క్యూబుల్లోకి ఎక్కేసిన తరవాత.. సినిమాకి ట్రిమ్ చేయాలనుకోవడం చిత్రబృందానికి కాస్త ఇబ్బంది కలిగించిందని, అయితే… త్రివిక్రమ్మాత్రం ఎవరి మాటా వినకుండా సినిమాకి కత్తెర్లు వేశాడని తెలుస్తోంది. ఇప్పటికీ సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఆ ట్రిమ్మింగ్ చేసుకోకపోతే… మరింత భారంగా గడిచి, సినిమా ఫలితంపై తీవ్రమైన ప్రభావం చూపించేది. ఈమధ్య కొన్ని సినిమాలు నిడివి కారణం వల్లే బాక్సాఫీసు దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఆ ప్రమాదం ముందే పసిగట్టి.. సినిమాని ట్రిమ్ చేసి మరీ వదిలాడు. సినిమా ఇప్పుడు హిట్టయిపోయింది కాబట్టి.. ఆ సీన్లన్నీ చూపించినా చూపించొచ్చు.